CISF – Parliament : పార్లమెంట్ భద్రత బాధ్యత సీఐఎస్ఎఫ్‌కు
CISF - Parliament : పార్లమెంటు భద్రత బాధ్యతను ఇక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ (సీఐఎస్ఎఫ్) చేపట్టనుంది.
- Author : Pasha
Date : 21-12-2023 - 1:58 IST
Published By : Hashtagu Telugu Desk
CISF – Parliament : పార్లమెంటు భద్రత బాధ్యతను ఇక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ (సీఐఎస్ఎఫ్) చేపట్టనుంది. పార్లమెంటు ఉన్నత స్థాయి కమిటీ చేసిన సూచన ప్రకారం భద్రత బాధ్యతను సీఐఎస్ఎఫ్‌కు అప్పగించారు. ఇక పార్లమెంటులోకి ప్రవేశించే వారిని సీఐఎస్ఎఫ్ దళాలే ఫ్రిస్కింగ్ చేస్తాయి. ఇప్పటి వరకు పార్లమెంట్ భద్రత అంశాన్ని ఢిల్లీ పోలీసులు చూసుకునేవారు. గత వారం లోక్‌సభలోకి ఇద్దరు వ్యక్తులు వెళ్లి స్మోక్ అటాక్‌కు పాల్పడ్డారు. మరో ఇద్దరు వ్యక్తులు పార్లమెంటు ఆవరణలో కలర్ క్యాన్లతో అలజడి సృష్టించారు. ఈ నేపథ్యంలో భద్రతా మార్పుపై ప్రభుత్వం(CISF – Parliament) నిర్ణయం తీసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
CISF అనేది కేంద్ర సాయుధ పోలీసు దళం (CAPF). ఇది ప్రస్తుతం ఢిల్లీలోని అనేక కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ భవనాలను అణు, ఏరోస్పేస్ డొమైన్, పౌర విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రోలలోని ఇన్‌స్టాలేషన్‌లను కాపాడుతుంది. బుధవారం పార్లమెంటు భవన సముదాయాన్ని సర్వే చేయాల్సిందిగా కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ఈ సర్వే అనంతరం సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది , అగ్నిమాపక విభాగాన్ని పార్లమెంటు సముదాయంలో మోహరించనున్నారు. సీఐఎస్ఎఫ్ నిర్వహించనున్న ఈ సర్వేలో ప్రభుత్వ భవన భద్రతా విభాగానికి చెందిన నిపుణులు, ప్రస్తుత పార్లమెంట్ భద్రతా బృందంలోని అధికారులు, ఫైర్ కంబాట్ నిపుణులు పాల్గొంటారు. ఈ వారం చివరికల్లా సర్వే పూర్తయ్యే అవకాశం ఉంది. పార్లమెంటు కొత్త భవనం, పాత భవనం, వాటి అనుబంధ భవనాలు రెండు కూడా CISF భద్రతా పరిధిలోకి వస్తాయి.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ తో సందీప్ వంగా మూవీ, లేటెస్ట్ అప్డేట్ ఇదే
పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశారు. గతంలో అరెస్టయిన నిందితుల్లో లోక్‌సభలోకి చొరబడిన మనోరంజన్, సాగర్ శర్మ, పార్లమెంటు వెలుపల పొగ డబ్బాలు ఉపయోగించిన అమోల్ షిండే, నీలం ఆజాద్ ఉన్నారు. లలిత్ ఝాను భద్రతా ఉల్లంఘనకు ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. లలిత్‌తో పాటు అతనికి సాయం చేసిన మహేష్ కుమావత్‌ను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తాజాగా బుధవారం సాయంత్రం అరెస్టయిన వారిలో కర్ణాటకకు చెందిన టెకీ సాయికృష్ణ జగాలి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. సాయికృష్ణ జగాలి మాజీ డీఎస్పీ కొడుకు అని విచారణలో వెల్లడైంది.