Karnataka Bus Accident: కర్ణాటకలో బోల్తా కొట్టిన స్కూల్ బస్.. విద్యార్థులు, టీచర్లకు గాయాలు
కర్ణాటకలోని శివమొగ్గలో స్కూల్ బస్ ప్రమాదానికి గురైంది
- Author : Anshu
Date : 15-12-2022 - 8:21 IST
Published By : Hashtagu Telugu Desk
కర్ణాటకలో స్కూల్ బస్ ప్రమాదానికి గురైంది. విద్యార్థులు మరియు టీచర్లతో వెళుతున్న స్కూల్ బస్ ఒక్కసారిగా అదుపుతప్పడంతో అది బోల్తా కొట్టింది. బస్ బోల్తా కొట్టిన సమయంలో స్కూల్ బస్ లో విద్యార్థులు మరియు టీచర్లు కలిపి 47 మంది ఉన్నట్లు సమాచారం. స్కూల్ బస్ బోల్తా పడిన ఘటనలో గాయపడిన క్షతగాత్రులు స్థానికులు మరియు పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
కర్ణాటకలోని మైసూర్ జిల్లా హుస్నూర్ తాలూకా ధర్మపుర ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు మరియు టీచర్లతో కూడిన బస్ ఈ ప్రమాదానికి గురైంది. శివమొగ్గ జిల్లా సాగర్ తాలూక వక్కోడి సమీపంలో స్కూల్ బస్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది స్కూల్ విద్యార్థులతో పాటు ముగ్గురు టీచర్లకు గాయాలైనట్లు సమాచారం అందుతోంది.
స్కూల్ బస్ అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కాగా స్కూల్ బస్ బోల్తా పడిందనే సమాచారం అందుకున్న స్థానికులు మరియు నేతలు ఒక్కసారిగా ఆస్పత్రికి పోటెత్తారు. ఘటనా స్థలంలో కూడా చురుకుగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.