Rahul Gandhi : సీఈసీ నియామకాన్ని తప్పుపట్టిన రాహుల్‌గాంధీ
ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి ఈ ప్రక్రియలో అమర్యాదపూర్వకంగా వ్యవహరించినట్లు ఆరోపించారు. సీఈసీ నియమాక ప్రక్రియపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు.
- Author : Latha Suma
Date : 18-02-2025 - 3:27 IST
Published By : Hashtagu Telugu Desk
Rahul Gandhi : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్‌ను అర్ధరాత్రి నియమించడంపై తీవ్రంగా తప్పుపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర సర్కారు తుంగలో తొక్కినట్లు ఆరోపించారు. సీఈసీ ఎంపిక ప్రక్రియలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాలని, కానీ చీఫ్ జస్టిస్ లేకుండానే హడావుడిగా సీఈసీ పేరును ప్రకటించినట్లు రాహుల్ విమర్శించారు. ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి ఈ ప్రక్రియలో అమర్యాదపూర్వకంగా వ్యవహరించినట్లు ఆరోపించారు. సీఈసీ నియమాక ప్రక్రియపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు.
Read Also: YCP : రా.7గంటలకు సంచలన నిజం బయటకు: వైసీపీ ట్వీట్
సీజేఐను తొలగించడంపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకు తన అసమ్మతిని తెలియజేసినట్లు చెప్పారు. ఇప్పుడేమో అర్ధరాత్రి కొత్త సీఈసీని ప్రకటించేశారు. దీంతో కోట్లాది మంది ఓటర్లకు తీవ్ర అనుమానాలు మొదలయ్యాయని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. 1949లో ఎన్నికల సంఘం ఏర్పాటు విషయంలో చేసిన వార్నింగ్‌ను కేంద్ర ప్రభుత్వం పక్కనపెట్టిందన్నారు. అంబేద్కర్ ఆశయాలను కాపాడడం ప్రతిపక్ష నేతగా తన బాధ్యత అని, ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని రాహుల్ పేర్కొన్నారు.
ఇక ప్రస్తుత ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ స్థానంలో జ్ఞానేష్ కుమార్‌ను కేంద్రం ప్రకటించింది. రాజీవ్ కుమార్ మంగళవారం పదవీ విరమణ చేశారు. సోమవారం అర్ధరాత్రి జ్ఞానేష్ కుమార్ పేరును కేంద్రం ప్రకటించింది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించింది. కాగా, కొత్త చట్టం ప్రకారం సీఈసీని నియమించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 19న విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణ ముగిసే వరకు కొత్త సీఈసీపై నిర్ణయాన్ని వాయిదావేయాలని త్రిసభ్య కమిటీ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ సూచించినట్లు సమాచారం.
Read Also: 200 Year Old Peoples: 200 ఏళ్లు దాటిన వారు 2వేల మందికిపైనే.. సంచలన ప్రకటన