Rahul Gandhi : చిన్న స్పర్ధ వచ్చినా సర్కార్ ఢమాల్.. టచ్‌లోనే ఎన్డీయే నేతలు : రాహుల్‌గాంధీ
ఎన్డీయే సర్కారుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.
- By Pasha Published Date - 05:19 PM, Tue - 18 June 24

Rahul Gandhi : ఎన్డీయే సర్కారుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. కేంద్రంలోని ఎన్డీయే సంకీర్ణ సర్కారులో మిత్రపక్షాలుగా ఉన్న కొన్ని పార్టీలు, కీలక నేతలు తమతో టచ్‌లో ఉన్నారని ఆయన వెల్లడించారు. ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలోని మిత్రపక్షాల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, అందులో బీజేపీ పెత్తనం సాగుతోందన్నారు. ఇది ఇష్టం లేని పార్టీ ఇండియా కూటమితో జతకట్టేందుకు సంసిద్ధంగా ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. ‘ఫైనాన్షియల్ టైమ్స్’ అనే అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ అగ్రనేత ఈ వ్యాఖ్యలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘ఈసారి ఎన్డీయే సర్కారు అంత బలంగా లేదు. అది చాలా నాజూకుగా ముందుకు సాగుతోంది. చిన్నపాటి కుదుపు వచ్చినా అది పేకమేడలా కూలిపోతుంది’’ అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఈ ఐదేళ్లు ప్రభుత్వ మనుగడ కోసం తాపత్రయ పడటమే ఎన్డీయేకు ఏకైక లక్ష్యంగా మిగిలిపోవచ్చని ఎద్దేవా చేశారు. ‘‘ఇండియా కూటమి, ఎన్డీయే కూటములు ఈసారి ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డాయి. రెండు కూటముల మధ్య కొన్ని లోక్‌సభ సీట్ల తేడానే ఉంది. ఎన్డీయే కూటమిలో ఏ చిన్న సమస్య వచ్చినా.. ఏ మిత్రపక్షంతో చిన్నపాటి స్పర్ధ వచ్చినా ప్రభుత్వం పడిపోతుంది. ఏ క్షణమైనా రాజకీయాలు మారిపోయే అవకాశం ఉంటుంది’’ అని రాహుల్ (Rahul Gandhi) తెలిపారు.
Also Read : Gemini Mobile App : భారత్‌లోకి గూగుల్ ‘జెమిని’ వచ్చేసింది..
‘‘2014, 2019 ఎన్నికల ప్రచారాల్లో విద్వేషపూరిత ప్రసంగాలతో మోడీ లబ్ధి పొందారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆయన్ను తిరస్కరించారు. మోడీ ప్రసంగాలతో బీజేపీకి చాలా నష్టం కలిగింది. ఇండియా కూటమికి లబ్ధి చేకూరింది’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ‘‘ఈసారి ప్రజల తీర్పుతో షాక్‌కు గురైన బీజేపీ.. గతి లేని పరిస్థితుల్లో మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి పెద్ద గుణపాఠం’’ అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఈ సారి 99 దాకా లోక్‌సభ సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి 230కిపైనే సీట్లు దక్కాయన్నారు. మరో వారం రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.