Union Budget 2025 : సీతారామన్ బడ్జెట్ పై ప్రధాని స్పందన
ప్రసంగం తరువాత నిర్మలాసీతారామన్ కూర్చున్న ప్రదేశానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అందరూ మిమ్మల్నీ ప్రశంసిస్తున్నారు. బడ్జెట్ చాలా బాగుంది.. అని నిర్మలా సీతారామన్‌ను ప్రధాని మోడీ అభినందించారు.
- By Latha Suma Published Date - 03:26 PM, Sat - 1 February 25

Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన బడ్జెట్ ప్రసంగం.. మధ్యాహ్నం 12.15 గంటల వరకు కొనసాగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా రూ. 50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ. 34,20,409 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లలో రూ. 16,44,936 కోట్లుగా ఉండబోతున్నట్లు తెలిపారు. 2025-26 బడ్జెట్‌లో అత్యధికంగా రక్షణ రంగానికి నిధులు కేటాయించారు. ఆ తర్వాత గ్రామీణాభివృద్ధికి నిధులు కేటాయించారు. శాస్త్ర, సాంకేతిక రంగానికి రూ. 55 వేల కోట్లు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
అయితే బడ్జెట్ ప్రసంగం అనంతరం ప్రధాని మోడీ నిర్మలమ్మను ప్రశంసించినట్లు తెలుస్తుంది. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం తరువాత నిర్మలాసీతారామన్ కూర్చున్న ప్రదేశానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అందరూ మిమ్మల్నీ ప్రశంసిస్తున్నారు. బడ్జెట్ చాలా బాగుంది.. అని నిర్మలా సీతారామన్‌ను ప్రధాని మోడీ అభినందించారు.
మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బడ్జెట్ పై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ హృదయంలో మధ్యతరగతి ప్రజలకు ఎల్లప్పుడూ స్థానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సంవత్సరానికి రూ.12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా కేంద్ర బడ్జెట్‌లో వెసులుబాటు కల్పించిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రయోజనం పొందిన లబ్ధిదారులందరికీ అమిత్ షా అభినందనలు తెలియజేశారు. ప్రతిపాదిత పన్ను మినహాయింపు ప్రకటన మధ్యతరగతి ప్రజల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన తెలిపారు.
Read Also: Party Defections : పార్టీ మారితే రాజీనామా చేయాల్సిందే : కేరళ హైకోర్టు