Party Defections : పార్టీ మారితే రాజీనామా చేయాల్సిందే : కేరళ హైకోర్టు
దేశంలో ప్రజాస్వామ్యం వీధుల్లో వివాదాలకు, విధ్వంసాలకు దారితీస్తోందని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ వ్యక్తిని ఓడించాలంటే సరైన పద్ధతి బ్యాలెట్ పేపర్ల ద్వారానే తప్ప ఆయుధాలతో కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
- By Latha Suma Published Date - 02:07 PM, Sat - 1 February 25

Party Defections : కేరళ హైకోర్టు పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ మారాలనుకునే ప్రజాప్రతినిధులు ముందుగా పదవికి రాజీనామా చేయాలని… రాజీనామా చేసిన తర్వాత నిర్వహించే ఎన్నికల్లో గెలిచి చూపించాలని వ్యాఖ్యానించింది. అప్పుడే ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం ఉంటుందని తెలిపింది. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
దక్షిణాది రాష్ట్రంలోని కూత్తట్టుకుళం నగర సభకు చెందిన మహిళా కౌన్సిలర్‌పై దాడికి పాల్పడిన ఐదుగురికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. యుడిఎఫ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయించినందుకు ఎల్‌డిఎఫ్ కౌన్సిలర్ కళా రాజును ఆమె సొంత పార్టీ సభ్యులే జనవరి 18న కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్ రెండూ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు చేరువ కాకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని జస్టిస్ పివి కున్హికృష్ణన్ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యం వీధుల్లో వివాదాలకు, విధ్వంసాలకు దారితీస్తోందని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ వ్యక్తిని ఓడించాలంటే సరైన పద్ధతి బ్యాలెట్ పేపర్ల ద్వారానే తప్ప ఆయుధాలతో కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
అంతేకాక..ప్రజల మద్దతుతో ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారినప్పటికీ… పదవికి రాజీనామా చేయకపోవడం ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించడమే అవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. పార్టీ ఫిరాయింపుదారులను గెలిపించాలో? లేక ఓడించాలో? ప్రజలకు బాగా తెలుసని చెప్పింది. ప్రజాస్వామ్యానికి ఉన్న గౌరవం ఇదేనని కేరళ హైకోర్టు తెలిపింది.