100 Encounters – One Man : ఎన్కౌంటర్ స్పెషలిస్టుకు జీవితఖైదు.. ఎందుకు ?
100 Encounters - One Man : ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. వందమందికి పైగా గ్యాంగ్స్టర్లను మట్టుబెట్టారు.
- By Pasha Published Date - 03:26 PM, Wed - 20 March 24

100 Encounters – One Man : ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. వందమందికి పైగా గ్యాంగ్స్టర్లను మట్టుబెట్టారు. అయితే తాజాగా నకిలీ ఎన్కౌంటర్ కేసులో ఆయనకు జీవితఖైదు శిక్ష పడింది. ఈ శిక్షపడిన ఆ మాజీ సంచలన పోలీసు అధికారి పేరు ప్రదీప్‌శర్మ. మహారాష్ట్రలో ఒకప్పుడు ఈయన పెను సంచలనం క్రియేట్ చేశారు. 1983లో పోలీసు ఉద్యోగంలో చేరిన ప్రదీప్ శర్మ ముంబయి అండర్‌వర్డల్ డాన్ ఛోటా రాజన్, ఇతర గ్యాంగ్స్టర్లకు చుక్కలు చూపించారు. ఒకే ఏడాదిలో రాజన్ అనుచరుడు వినోద్ మట్కర్, దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ కంపెనీ గ్యాంగ్‌స్టర్ సాదిఖ్ కాలియాను ఎన్కౌంటర్ చేశారు. 2003లో లష్కరే తైబా అనుమానితులను శర్మ టీమ్ హతమార్చింది. అండర్‌వరల్డ్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 2008లో ప్రదీప్‌ను విధుల నుంచి తప్పించారు. అయితే అనూహ్య పరిణామాల నడుమ 2009లో ఆయన తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకీ ఆయనకు జీవిత ఖైదు శిక్ష ఎందుకు పడింది ? ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
2006లో జరిగిన ఎన్కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ ఛోటారాజన్ అనుచరుడు రామ్‌నారాయణ్ గుప్తా అలియాస్ లఖన్ భయ్యాను ప్రదీప్ కాల్చి చంపారు. ఈ నకిలీ ఎన్కౌంటర్ కేసులో 2010లో ప్రదీప్‌ను అరెస్టు చేశారు. నాలుగు సంవత్సరాల శిక్ష అనంతరం కోర్టు నిర్దోషిగా తేల్చడంతో 2013లో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. 2019లో తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన.. ఆ వెంటనే శివసేనలో చేరారు. ఆ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. నకిలీ ఎన్ కౌంటర్ కేసుపై లోతుగా విచారణ జరిపిన బాంబే హైకోర్టు ప్రదీప్‌కు ఇటీవల జీవితఖైదు విధించింది. మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆయనను ఆదేశించింది. ప్రదీప్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ 2013లో కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు తప్పు పట్టింది. ఇదే కేసుకు సంబంధించి పోలీసు సిబ్బంది సహా 13 మందికి జీవితఖైదు విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. మరో ఆరుగురికి ఆ శిక్షను రద్దు చేసి నిర్దోషులుగా ప్రకటించింది.
Also Read :Hyderabad Student : అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్.. డబ్బుల కోసం కిడ్నాపర్ల ఫోన్లు
ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో..
మూడేళ్ల క్రితం ముంబైలో ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల వాహనాన్ని గుర్తించిన ఘటన సంచలనం సృష్టించింది. ఆ వాహన యజమానిగా చెబుతున్న హిరేన్ మన్సుఖ్ శవమై కనిపించారు. ఈ కేసుల విచారణ సమయంలో ప్రదీప్ పేరు వెలుగులోకి వచ్చింది. వీటికి సంబంధించి 2021లో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది.
Also Read :Abhishek Boinapally : అభిషేక్ బోయినపల్లికి మధ్యంతర బెయిల్.. లిక్కర్ స్కాంలో పాత్రేమిటి ?
ఓటీటీ సిరీస్‌లో ప్రదీప్ శర్మ పాత్రలో స్వయంగా నటించి..
ఓటీటీ సిరీస్ ‘ముంబయి మాఫియా: పోలీస్ వర్సెస్ అండర్ వరల్డ్’తో 2023లో ప్రదీప్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ప్రదీప్, ఆయన టీమ్ కలిసి ముంబైలో డీ-కంపెనీని ఎలా అణచివేసిందో అందులో చూపించారు. అందులో ప్రదీప్ శర్మ (100 Encounters – One Man) పాత్రలో ఆయనే నటించడం విశేషం.