Vivekananda Rock Memorial : ప్రధాని మోడీ 45 గంటల ధ్యానం.. వివేకానంద రాక్ మెమోరియల్ గురించి తెలుసా ?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ సాయంత్రం నుంచి దాదాపు 45 గంటల పాటు తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్‌లో ధ్యానం చేయనున్నారు.
- By Pasha Published Date - 04:10 PM, Thu - 30 May 24

Vivekananda Rock Memorial : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ సాయంత్రం నుంచి దాదాపు 45 గంటల పాటు తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్‌లో ధ్యానం చేయనున్నారు. వివేకానంద రాక్ మెమోరియల్ అనేది స్వామి వివేకానందకు గుర్తుగా నిర్మించిన స్మారక చిహ్నం. కన్యాకుమారిలోని వవతురై బీచ్ నుంచి 500 మీటర్ల దూరంలో సముద్రంలోని ఒక భారీ రాతి ముక్కపై వివేకానంద రాక్ మెమోరియల్ ఉంది.
We’re now on WhatsApp. Click to Join
1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో భారతదేశ ఆధ్యాత్మిక ఖ్యాతిని వివేకానందుడు చాటిచెప్పారు. అందుకు గౌరవ సూచకంగా 1970లో కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్‌ను నిర్మించారు. అయితే వివేకానంద రాక్ మెమోరియల్ ఉన్న ప్రదేశానికి చాలా ప్రత్యేకత ఉంది. దీనికి వివేకానందుడితో ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడి ధ్యాన శిలపై కూర్చొని ధ్యానం చేసిన తర్వాతే స్వామి వివేకానందుడికి జ్ఞానోదయం కలిగిందని అంటారు. వివేకానందుడు జ్ఞానోదయం పొందే వరకు మూడు పగలు, మూడు రాత్రులు రాక్ మెమోరియల్‌లోని(Vivekananda Rock Memorial) శిలపైనే ధ్యానం చేశారని చెబుతుంటారు. నాలుగు సంవత్సరాల పాటు దేశం మొత్తం పర్యటించిన తర్వాత ఇక్కడికి చేరుకొని వివేకానందుడు ధ్యానం చేశారని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం.. ఇదే స్థలంలో మాతా కన్యాకుమారి దేవి, శివుడి కోసం తపస్సు చేశారని చెబుతారు. నేటికీ కన్యాకుమారి దేవి పాదాల ముద్ర ఉన్న ప్రదేశాన్ని పవిత్రంగా పూజిస్తారు.
Also Read :AP Elections : వైసీపీకి షాకిచ్చిన ఈసీ.. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌పై క్లారిటీ
కాగా, గురువారం సాయంత్రం లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఘట్టం ముగిసింది. ఇప్పటి నుంచి 48 గంటల పాటు కూలింగ్ పీరియడ్ అమల్లో ఉంటుంది. అంటే ఇక పోలింగ్ ముగిసే దాకా ప్రచారం చేయడానికి వీలుండదు. ప్రతీ సార్వత్రిక ఎన్నికల తుది విడత ప్రచార ఘట్టం తర్వాత ఇలా ధ్యానం చేయడం ప్రధాని మోడీకి అలవాటు. 2019 లోక్‌సభ ఎన్నికల టైంలోనూ ప్రధాని మోడీ ఇలాగే ఉత్తరాఖండ్‌లో ధ్యానం చేశారు. మోడీ పర్యటన నేపథ్యంలో కన్యాకుమారిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. స్వామి వివేకానందుడు స్థాపించిన రామకృష్ణ మిషన్ 125వ వార్షికోత్సవంలోనూ ప్రధాని మోడీ గతంలో ప్రసంగించారు.