C-295 Aircraft Manufacturing: వడోదరలో ఎయిర్‌బస్‌ల తయారీ.. శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ..!
గుజరాత్‌లోని వడోదరలో తయారుకానున్న సీ-295 విమానాల తయారీ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
- Author : Gopichand
Date : 30-10-2022 - 7:14 IST
Published By : Hashtagu Telugu Desk
గుజరాత్‌లోని వడోదరలో తయారుకానున్న సీ-295 విమానాల తయారీ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా టాటా-ఎయిర్‌బస్ కన్సార్టియం దీనిని ఏర్పాటు చేస్తోంది. భారత వాయుసేనను ఆధునికీకరించాలనే లక్ష్యంతోనే ఈ కంపెనీని స్థాపిస్తున్నట్లు మోదీ తెలిపారు. కాగా ఈ ప్రాజెక్టుకు రూ.21,935 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం వడోదరలో సి-295 రవాణా విమానాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, టాటా సన్స్ చైర్ పర్సన్ ఎన్. చంద్రశేఖరన్ సత్కరించి జ్ఞాపికను అందజేశారు. భారత వైమానిక దళానికి సంబంధించి సి-295 రవాణా విమానాన్ని టాటా ఎయిర్‌బస్ తయారు చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. 40 విమానాలను తయారు చేయడమే కాకుండా వడోదరలోని ఈ సదుపాయం వైమానిక దళ అవసరాలు, ఎగుమతుల కోసం అదనపు విమానాలను తయారు చేస్తుందని రక్షణ కార్యదర్శి అరమనే గిరిధర్ తెలిపారు.
ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ రంగం ద్వారా విమానాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన జరిగిందని, ఇది కచ్చితంగా రక్షణ రంగానికి, దేశం మొత్తానికి గర్వకారణమన్నారు. ఇది కేవలం పునాది రాయి కాదు. రక్షణ రంగం యొక్క ‘ఆత్మనిర్భర్త’ ప్రయాణంలో ఒక మైలురాయి అని సింగ్ తెలిపారు.