BJP – Pawan : పవన్ తో బిజెపి “ఆపరేషన్ సౌత్” వర్క్ అవుట్ అయ్యేనా..?
BJP - Pawan : తిరుపతి లడ్డూ వివాదం వేళ ఆయన చేపట్టిన ప్రాయశ్చిత దీక్ష, సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు జాతీయస్థాయిలో చర్చనీయాంశమయ్యాయి
- By Sudheer Published Date - 07:21 AM, Wed - 12 February 25

భారతీయ జనతా పార్టీ (BJP) దక్షిణాదిలో తన పట్టు బలోపేతం చేసేందుకు “ఆపరేషన్ సౌత్” (BJP Operation South)ప్రారంభించింది. ఈ కార్యాచరణలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటి వరకు ఏపీ రాజకీయాల్లోనే ప్రధానంగా కేంద్రీకృతమైన పవన్, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించారు. తిరుపతి లడ్డూ వివాదం వేళ ఆయన చేపట్టిన ప్రాయశ్చిత దీక్ష, సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు జాతీయస్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు, ఎన్డీఏ భవిష్యత్ బలోపేతం కోసం పవన్ నేరుగా రంగంలోకి దిగనున్నారు.
Chiranjeevi Politics : రాజకీయాలకు జోలికి వెళ్ళాను – చిరు ఫుల్ క్లారిటీ
దక్షిణాదిలో బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. కేరళ, తమిళనాడుల్లో ప్రాబల్యం పెంచుకునేందుకు పవన్ కీలక అస్త్రంగా మారనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు నుంచి పవన్ కేరళ, తమిళనాడు పర్యటనను ప్రారంభించనున్నారు. ఈ నాలుగు రోజుల పర్యటనలో అనంతపద్మనాభస్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామ స్వామి, అగస్త్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తని సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శించనున్నారు. పవన్ చేసిన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్‌కు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. బీజేపీ – జనసేన కూటమి దక్షిణాదిలో పాగా వేసే ప్రయత్నాల్లో ఉంది. ఈ వ్యూహంలో భాగంగా పవన్ తమిళనాడు, కేరళ, తెలంగాణలో కూడా ఎన్డీఏ బలోపేతంపై దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే ఆరెస్సెస్ కీలక నేతలు పవన్ డిమాండ్లకు మద్దతు తెలపడం గమనార్హం. సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో పవన్ ఆలయ సందర్శనను ప్రారంభించినప్పటికీ, దీని వెనుక దక్షిణాదిలో బీజేపీకి మరింత బలాన్ని చేకూర్చే రాజకీయ వ్యూహం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Thandel : చైతు భార్యకు దేవి స్పెషల్ థాంక్స్..ఎందుకంటే..!!
ఈ పర్యటన అనంతరం పవన్ కల్యాణ్ ఏపీలో జనసేన ప్లీనరీ సమావేశంలో కీలక రాజకీయ ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రత్యేకించి, తెలంగాణలో జనసేన విస్తరణ, తమిళనాడులో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయడం, కేరళలో హిందూ సమాజంపై దృష్టి సారించడం లాంటి అంశాలు చర్చనీయాంశమయ్యాయి. దీంతో పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్ ఎన్డీఏలో మరింత పటిష్ఠం కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పవన్ తాజా రాజకీయ సమీకరణాలు దక్షిణాదిలో ఉత్కంఠ రేపుతున్నాయి. ఆలయ సందర్శన వెనుక ఉన్న రాజకీయ లక్ష్యం, ఎన్డీఏలో పవన్ కీలక భూమిక, బీజేపీ దక్షిణాదిపై ఉన్న ఆశలు, ఇవన్నీ కలిపి భవిష్యత్ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేయనున్నాయి. ఏపీలో బలమైన మద్దతు ఉన్న జనసేన, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోనూ తన ప్రభావాన్ని చూపించేందుకు సిద్ధమవుతోంది. ఇది భవిష్యత్తులో బీజేపీ-జనసేన కూటమికి ఎంతవరకు లాభదాయకమవుతుందో చూడాలి.