Khawaja Muhammad Asif : భారత్‌లో పాక్ రక్షణ మంత్రి ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్‌పై ఆ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, ఆ ఖాతాను ఓపెన్ చేసిన వారికి చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక సందేశం దర్శనమిస్తోంది.
- By Latha Suma Published Date - 03:55 PM, Tue - 29 April 25

Khawaja Muhammad Asif : పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ ఎక్స్ ఖాతా ను భారత ప్రభుత్వం నిలిపివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్‌పై ఆ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, ఆ ఖాతాను ఓపెన్ చేసిన వారికి చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక సందేశం దర్శనమిస్తోంది.
Read Also: Mehul Choksi : బెల్జియం కోర్టులో మెహుల్ ఛోక్సీకి ఎదురుదెబ్బ
ఇప్పటికే కేంద్రప్రభుత్వం పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించిన విషయం తెలిసిందే. పాక్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై ఈ వేటు వేసింది. ఈ క్రమంలోనే రక్షణ మంత్రి ఖాతాను బ్లాక్ చేసింది. ఇందులో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్‌కు చెందిన యూట్యూబ్ చానల్ కూడా ఉన్నది. హోం శాఖ సిఫారసు మేరకు డాన్ న్యూస్, జియో న్యూస్, సమా టీవీ, సునో న్యూస్, ది పాకిస్థాన్ రెఫరెన్స్ తదితర యూట్యూబ్ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది.
పాక్ రక్షణమంత్రి పహల్గాం దాడి తర్వాత పలుమార్లు మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులను పెంచి పోషించడంపై మీ స్పందన ఏంటి? అని మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. లష్కరే తోయిబా ఉనికి ఇప్పుడు తమ దేశంలో లేదన్నారు. అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు మేం ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాం. అయితే అది పొరబాటు అని అర్థమైంది. దానివల్ల పాక్ చాలా ఇబ్బందులు పడింది. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం చేరకపోయి ఉంటే.. పాక్‌కు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉండేది అని అన్నారు.
మరోవైపు, పాక్ ఐఎస్‌ఐ భారత సైన్యం కదలికలపై కొత్త ఎత్తుగడలు వేస్తోంది. సైన్యం కదలికలపై పాకిస్థాన్ ఐఎస్‌ఐ ఆరా తీస్తోంది. సరిహద్దులోని మిలిటరీ సిబ్బంది, పౌరులకు భారతీయ సైనిక్ స్కూల్ ఉద్యోగులమంటూ ఐఎస్‌ఐ ఫోన్లు చేస్తోంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని తెలియని వారికి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని సరిహద్దు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచిస్తుంది.