Pak Army : నిద్రలేని రాత్రులు గడుపుతున్న పాక్ ఆర్మీ
Pak Army : సరిహద్దుల్లో భారత వైమానిక దళం దాడులకు దిగితే వెంటనే గుర్తించేందుకు పాకిస్తాన్, సియాల్కోట్ ప్రాంతంలో రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ డిటాచ్మెంట్లు ఏర్పాటు చేసింది
- Author : Sudheer
Date : 29-04-2025 - 12:12 IST
Published By : Hashtagu Telugu Desk
భారత్ (India) ఎప్పుడు దాడి చేస్తుందో అనే భయంతో పాకిస్తాన్ ఆర్మీ (Pak Army) నిద్రలేని రాత్రులు గడుపుతుంది. సరిహద్దుల్లో భారత వైమానిక దళం దాడులకు దిగితే వెంటనే గుర్తించేందుకు పాకిస్తాన్, సియాల్కోట్ ప్రాంతంలో రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ డిటాచ్మెంట్లు ఏర్పాటు చేసింది. భారత్-పాక్ సరిహద్దుకు కేవలం 58 కి.మీ దూరంలో ఈ టెక్నికల్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం పాక్ ఉత్కంఠకు నిదర్శనం. భారత్ వైపు నుంచి ప్రతిస్పందన ఏ దశలో వస్తుందోనన్న ఆందోళనతో పాక్ ఆర్మీ తడబడుతున్నట్టు తెలుస్తోంది. ఇక పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. దాంతో పాక్ ఆర్మీ రెచ్చిపోతూ నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు పాల్పడుతోంది.
Pahalgam Incident : పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు నిర్వహించండి..ప్రధానికి రాహుల్ లేఖ
తాజాగా ఏప్రిల్ 28–29 రాత్రి సమయంలో కుప్వారా, బారాముల్లా, అఖ్నూర్ సెక్టార్‌లలో పాక్ సైన్యం భారత పోస్ట్‌లపై చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది. అయితే ఈ రెచ్చగొట్టే చర్యలకు భారత బలగాలు సమర్థవంతంగా ప్రతిస్పందించాయి. భారత సైన్యం తూటాలు పేల్చి పాక్ దుశ్చర్యను అణిచివేసింది. మరోపక్క భారత ప్రభుత్వం సైతం ఉగ్రదాడి పై కఠిన చర్యలు తీసుకుంది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అటారీ–వాఘా సరిహద్దును మూసివేయనున్నట్టు తెలిపింది. భారత్‌లో ఉన్న పాక్ జాతీయులను దేశం విడిచిపెట్టి వెళ్లాలని ఆదేశించింది. అంతేకాకుండా జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు, వారికి సహకరించే వారిపై భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఇప్పటివరకు ఆరుగురు ఉగ్రవాదుల ఇళ్లు కూల్చివేయగా, వందలాది మందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.