H 1B Visa Rules : భారతీయ టెక్ నిపుణులకు గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసా రూల్స్ సులభతరం
హెచ్-1బీ వీసా(H 1B Visa Rules) అనేది నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి వస్తుంది.
- By Pasha Published Date - 01:36 PM, Wed - 18 December 24

H 1B Visa Rules : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పదవీ కాలం జనవరి 19తో ముగియబోతోంది. జనవరి 20 నుంచి ఆ దేశ నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపడుతారు. తాను పదవి నుంచి దిగిపోతున్న వేళ భారతీయులకు బైడెన్ గుడ్ న్యూస్ చెప్పారు. నిపుణులైన విదేశీయులను ఉద్యోగాల్లో భర్తీ చేసుకునేందుకు అమెరికా కంపెనీలకు అవకాశం కల్పించేలా వీసా నిబంధనల్లో బైడెన్ సర్కారు మార్పులు చేసింది. ఎఫ్-1 విద్యార్థి వీసాలను సులభతరంగా హెచ్-1బీ వీసాలుగా మార్చుకునే ఛాన్స్ కల్పించింది.దీనివల్ల ఇప్పటివరకు ఎఫ్-1 వీసాలకు ఎదురవుతున్న చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. 2025 జనవరి 17 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలతో లక్షలాది మంది భారతీయ టెక్ నిపుణులు లబ్ధిపొందనున్నారు.
Also Read :Celebrity Divorces 2024 : వామ్మో.. 2024లో డైవర్స్ తీసుకున్న సెలబ్రిటీలది పెద్దలిస్టే!
హెచ్-1బీ వీసా(H 1B Visa Rules) అనేది నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి వస్తుంది. దీనివల్ల ప్రధానంగా భారత్, చైనాలకు చెందిన టెక్ నిపుణులు లబ్ధి పొందారు. గతంలోనే హెచ్1బీ వీసా పొందినవారి పౌరసత్వం, ఇమిగ్రేషన్ సేవలకు సంబంధించిన అప్లికేషన్లను స్పీడుగా ప్రాసెస్ చేస్తామని బైడెన్ సర్కారు వెల్లడించింది. నాన్‌ప్రాఫిట్, ప్రభుత్వేతర పరిశోధనా సంస్థల నిర్వచనం, నిబంధనల్లో మార్పులు చేసినట్లు తెలిపింది. ఈ నిబంధనలను వాడుకొని అమెరికా కంపెనీలు అవసరాలకు తగినట్లుగా నియామకాలు చేసుకొని ప్రపంచ పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవచ్చు. అమెరికా ప్రభుత్వం ఏటా 65 వేల హెచ్1బీ వీసాలు, 20 వేల అడ్వాన్స్ డిగ్రీ వీసాలను జారీ చేస్తుంటుంది. అయితే చాలా నాన్‌ప్రాఫిట్ సంస్థలకు దీనినుంచి మినహాయింపులు ఉన్నాయి. కొత్త రూల్స్ కింద ఈ సంస్థలు తమ పనిని ‘పరిశోధన’గా పేర్కొనాల్సి ఉంటుంది. కాగా, 1990లో అమెరికా కాంగ్రెస్ హెచ్1బీ వీసాల జారీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. విదేశాల్లోని టెక్ నిపుణులను అమెరికా కంపెనీలు ఉద్యోగాల కోసం ఆహ్వానించేందుకు మార్గాన్ని సుగమం చేయడమే ఈ వీసాల ప్రధాన లక్ష్యం.