Boyfriend for Rent: ప్రేమికుల రోజు వేడుకకు గురుగ్రామ్ యువకుడి ఆఫర్.. బాయ్ ఫ్రెండ్ అద్దెకు..
బాయ్ ఫ్రెండ్ లేని సింగిల్ గర్ల్స్ (Single Girls) కోసం గురుగ్రామ్ కు చెందిన ఓ యువకుడు వినూత్న
- Author : Maheswara Rao Nadella
Date : 13-02-2023 - 11:15 IST
Published By : Hashtagu Telugu Desk
బాయ్ ఫ్రెండ్ (Boyfriend) లేని సింగిల్ గర్ల్స్ కోసం గురుగ్రామ్ కు చెందిన ఓ యువకుడు వినూత్న సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాడు. రోజుకు కొంత చెల్లించేందుకు సిద్ధపడితే బాయ్ ఫ్రెండ్ గా సేవలు అందించేందుకు సిద్ధమని ప్రకటించాడు. ఈ ప్రేమికుల రోజు (Valentine Day) ఒంటరిగా ఉండాలంటే బోర్ ఫీలయ్యేవారు తన సేవలు అందుకోవచ్చని వెల్లడించాడు. సిటీకి చెందిన 31 ఏళ్ల షాకుల్ గుప్తా చేసిన ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రేమికుల రోజు (Valentine Day) ఎలా జరుపుకోవాలని ప్రేమజంటలు రకరకాల ప్లాన్లు వేసుకుంటుంటే ఒంటరి పక్షులు మాత్రం బోర్ గా ఫీలవుతుంటారని షాకుల్ చెప్పాడు. వారి ఒంటరితనాన్ని పోగొట్టేందుకే తాను ఈ సేవలను ప్రారంభించినట్లు వివరించాడు. తన సేవలు లైంగిక అవసరాలకోసం కాదని ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. ఒంటరితనంతో బాధపడే వారి కోసం ఈ సేవలను 2 ప్రారంభించానని షాకుల్ తెలిపాడు.
తనకు ఎదురైన అనుభవం నేపథ్యంలోనే ఈ ‘అద్దెకు బాయ్ ఫ్రెండ్’ కాన్సెప్ట్ కు రూపమిచ్చానని పేర్కొన్నాడు. ప్రేమికుల దినోత్సవం నాడు లవర్స్ ఒకరికొకరు ఐ లవ్యూ చెప్పుకోవడం సర్వసాధారణమని, అలాంటి మాటలు వింటుంటే తనకూ ఓ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ (Boyfriend) ఉంటే బాగుండేదని ఒంటరి యువత భావిస్తుందని చెప్పారు. ఆ సమయంలో ఒంటరితనం వేధిస్తుందని, తాను కూడా గతంలో బాధపడ్డానని షాకుల్ తెలిపాడు.
అలాంటి వారు కొంతమొత్తం ఫీజు చెల్లించి తన సేవలను బుక్ చేసుకోవచ్చని షాకుల్ చెప్పాడు. అద్దెకు బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్ లో.. తనను అద్దెకు తీసుకున్న మహిళ ఒంటరితనాన్ని పోగొడతానని, కబుర్లు చెప్పడం, వారికోసం వంట చేసి పెట్టడంసహా చాలా రకాల సేవలందిస్తానని షాకుల్ చెప్పాడు. ఇప్పటి వరకు తను 50 మందికి ఇలాంటి సేవలందించానని పేర్కొన్నాడు.
Also Read: Aliens: అమెరికా కూల్చేసిన గుర్తుతెలియని వస్తువులు ఏలియన్స్ వా ?