Nitish Kumar : ఇండియా కూటమి కన్వీనర్ పోస్టు ఆ ముఖ్యమంత్రికే!
Nitish Kumar : అందరి అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి. విపక్ష కూటమి ‘ఇండియా’ కన్వీనర్‌గా బిహార్ సీఎం నితీష్ కుమార్ నియమితులయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
- By Pasha Published Date - 03:40 PM, Wed - 3 January 24

Nitish Kumar : అందరి అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి. విపక్ష కూటమి ‘ఇండియా’ కన్వీనర్‌గా బిహార్ సీఎం నితీష్ కుమార్ నియమితులయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు కూటమిలోని పార్టీల నేతలు మరో రెండు రోజుల్లో వర్చువల్‌గా సమావేశమవుతారని తెలుస్తోంది. నితీష్‌కు ‘ఇండియా’ కూటమి పగ్గాలను అప్పగించే ప్రతిపాదనపై కూటమిలోని పలు పార్టీల నేతల అభిప్రాయాలను ఇప్పటికే సేకరించినట్లు సమాచారం. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, శివసేన నేత ఉద్ధవ్ థాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్, దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలు నితీశ్‌కు కన్వీనర్ పోస్టు ఇచ్చే ప్రతిపాదనకు సానుకూలంగానే స్పందించారని అంటున్నారు. మరోవైపు నితీష్ కుమార్ సైతం తనకు మద్దతు ఇచ్చేలా శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నేతలతో మంతనాలు జరుపుతున్నారని అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక డిసెంబర్ 19న ఢిల్లీలో జరిగిన ‘ఇండియా’ సమావేశంలో కూటమి తరఫున ప్రధాని అభ్యర్ధిగా మల్లికార్జున ఖర్గే పేరును తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించారు. దీంతో నితీష్ కుమార్‌కు(Nitish Kumar) ఇక ఇండియా కూటమిలో కీలక పదవులేవీ దక్కకపోవచ్చనే అంచనాలు వెలువడ్డాయి. అయితే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం జాతీయ స్థాయి ఎన్నికల వ్యూహరచనపై ఖర్గే బిజీగా ఉండనున్నారు. ఒకవేళ ఖర్గేకు ఇండియా కూటమి కన్వీనర్ బాధ్యతలను అప్పగిస్తే.. పార్టీ బాధ్యతలపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేసే పరిస్థితి ఉండదనే నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే మధ్యేమార్గంగా నితీష్ కుమార్‌కు ఆ పోస్టును ఆఫర్ చేస్తున్నారని టాక్.