India-Pakistan Tension: పాకిస్తాన్‌కు మద్దతిస్తున్న టర్కీకి గుణపాఠం చెప్పాలంటే భారత్ ఈ నాలుగు పనులు చేయాలి..
భారతదేశం నుండి టర్కీకి గొప్ప ప్రయోజనం చేకూర్చే ప్రధాన మార్గం వాణిజ్యం.
- By News Desk Published Date - 10:30 PM, Tue - 13 May 25

India-Pakistan Tension: పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్ కు టర్కీ దేశం మద్దతుగా నిలిచింది. భారత్‌పై దాడికి పాక్ కు ఆయుధ సామాగ్రిని అందించింది. దీంతో భారతదేశంలో బాయ్‌కాట్ టర్కీ నినాదం ఊపందుకుంది. బాయ్‌కాట్ టర్కీ పేరుతో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా పుణెలోని వ్యాపారులు కూడా ఆ దేశం యాపిల్‌లను బహిష్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. దీంతో స్థానిక మార్కెట్‌లో అవి కనిపించకుండా పోతున్నాయి. స్థానికులు కూడా ఇతర ప్రదేశాల నుంచి దిగుమతి అయ్యే పండ్లను తీసుకుంటున్నారు. అయితే, టర్కీకి బుద్ధిచెప్పాలంటే భారత్ మరికొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
టర్కీని ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే దేశంగా ప్రకటించడానికి ..
టర్కీ ఒక ఉగ్రవాద దేశానికి మద్దతు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందుకూడా ఆ దేశం ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడంలో ప్రసిద్ధి చెందింది. 2020 లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సీనియర్ హమాస్ నాయకులకు ఆతిథ్యం ఇచ్చారని ప్రపంచానికి తెలుసు. టర్కీ 12 మంది హమాస్ సభ్యులకు టర్కిష్ పాస్‌పోర్ట్‌లను అందించినట్లు తెలుస్తోంది. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దీనిని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యగా అభివర్ణించింది. టర్కీ నేల నుండి హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి టర్కీ అనుమతించిందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఇలాంటి సమయంలో.. టర్కీని ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే దేశంగా ప్రకటించడానికి భారతదేశం తన అన్ని ప్రయత్నాలను చేయాలి.
భారతీయ సినిమాల షూటింగ్‌లను నిలిపివేయాలి..
ఓటీటీలో ఇటీవల విడుదలైన ‘జువెల్ థీఫ్’ గురించిన చర్చ మీరు వినే ఉంటారు. సైఫ్ అలీ ఖాన్ వంటి నటులు నటించిన ఈ సినిమా టర్కీలోనే షూట్ చేశారు. టర్కీలో భారతీయ సినిమాలు, టీవీ సీరియళ్ల షూటింగ్ ఆ దేశానికి ఆర్థిక, పర్యాటక, సాంస్కృతిక రంగాలలో భారీ ప్రయోజనాన్ని ఇస్తుంది. ప్రస్తుతం ఆ దేశంలో సంవత్సరానికి 5 నుంచి 10 ప్రధాన బాలీవుడ్ సినిమాలు, 10-15 టీవీ సీరియల్ ఎపిసోడ్‌లు చిత్రీకరించబడుతున్నాయని అంచనా. మొత్తంమీద, భారతీయ సినిమా, సీరియల్స్ షూటింగ్‌లు కారణంగా టర్కీ దేశానికి సంవత్సరానికి రెండు నుంచి ఐదు మిలియన్ యూస్ డాలర్లు సమకూరుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాక సంపన్న భారతీయ కుటుంబాలు తుర్కియేలో డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు వెళ్లడం ప్రారంభించాయి. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు మిలియన్ల రూపాయలను అందిస్తుంది. షూటింగ్ ఆపడం వల్ల టర్కీ ఇమేజ్ దెబ్బతింటుంది. ఇది ఇక్కడి ఆదాయంపై ప్రభావం చూపుతుంది.
పర్యాటకాన్ని నిలిపివేయాలి..
భారతీయ పర్యాటకులకు టర్కీ ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా అవతరించింది. 2024లో 2,75,000 కంటే ఎక్కువ మంది భారతీయ పర్యాటకులు టర్కీని సందర్శించారు. బిజినెస్ టుడే నివేదిక ప్రకారం.. ప్రతి భారతీయ పర్యాటకుడు సగటున రూ.1.2 లక్షలు ఖర్చు చేశాడు. 2025 నాటికి భారత పర్యాటకుల సంఖ్యను పెంచాలనే ఆకాంక్షను టర్కీ అధికారులు వ్యక్తం చేశారు. టర్కీలో భారతీయ సినిమా, సీరియళ్ల షూటింగ్ లు ఆగిపోతే, టర్కీ పర్యాటక ప్రదేశాల ప్రచారం తగ్గుతుంది. తద్వారా ఇక్కడికి వెళ్లే పర్యాటకుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది.
వాణిజ్యంపై కూడా నిషేధం ఉండాలి..
భారతదేశం నుండి టర్కీకి గొప్ప ప్రయోజనం చేకూర్చే ప్రధాన మార్గం వాణిజ్యం. ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ (IBEF) ప్రకారం, FY24 (ఏప్రిల్ 2023 నుండి మార్చి 2024 వరకు) కాలంలో భారతదేశం, టర్కీ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 10.4 బిలియన్ల యూఎస్ డాలర్లు. టర్కీకి భారతదేశం ఎగుమతులు 6.66 బిలియన్లు యూఎస్ డాలర్లు. టర్కీ నుండి దిగుమతులు 3.78 బిలియన్ల యూఎస్ డాలర్లు. భారతదేశానికి ఈ వాణిజ్య మిగులు టర్కియే 2024లో దాదాపు ఏడు బిలియన్ల యూఎస్ డాలర్లు విలువైన వస్తువులను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటుందని ట్రేడింగ్ ఎకనామిక్స్ డేటా చెబుతోంది. ఈ దిగుమతులు టర్కియే పారిశ్రామిక, వినియోగదారుల అవసరాలకు వెన్నెముకగా నిలుస్తాయి. ఇకనుంచి టర్కీ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులన్నింటిపై బ్యాన్ విధించాల్సిన అవసరం ఉంది. తద్వారా టర్కీ దేశానికి భారత్ దిమ్మతిరిగే షాకిచ్చినట్లవుతుంది.