Navjot Sidhu : ట్విటర్ వేదికగా సంచలన విషయాలు బయటపెట్టిన సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్
పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్(Navjot Kaur) తన ట్విటర్ వేదికగా సంచలన విషయాలు వెల్లడించింది.
- Author : News Desk
Date : 09-06-2023 - 10:15 IST
Published By : Hashtagu Telugu Desk
పంజాబ్ సీఎం భగవంత్ మాన్(Punjab CM Bhagawant Mann), కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్(Navjot Sidhu Singh) సిద్దూ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్(Navjot Kaur) తన ట్విటర్ వేదికగా సంచలన విషయాలు వెల్లడించింది. పంజాబ్ విజిలెన్స్ నిఘాలో ఉన్న పంజాబీ డెయిలీ సంపాదకుడికి మద్దతుగా జలంధర్‌లో విపక్ష పార్టీలు సమావేశం అయ్యాయి. దీంతో సీఎం భగవంత్ మాన్ విపక్షాల సమావేశంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేత సిద్ధూసైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ సమయంలో సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ట్విటర్ వేదికగా ఆమె సంచలన విషయాలు బయటపెట్టారు.
భగవంత్ మాన్ మీరు కూర్చున్న సీఎం సీటు మీ సోదరుడు (నవజ్యోత్ సిద్ధూ) మీకు ఇచ్చిన కానుక. ముందు ఈ విషయాన్ని నువ్వు గ్రహించాలి. మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ముందు వివిధ మార్గాల ద్వారా సిద్ధూను సంప్రదించారు. పంజాబ్‌కు సారథ్యం వహించాలని సిద్ధూను కోరారంటూ నవజ్యోత్ కౌర్ తన ట్విట్‌లో పేర్కొంది. అయితే, సొంత పార్టీని వంచించరాదనే కారణంగా సిద్ధూ మీ అధినేత ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. ఆ ఒక్క కారణం వల్లనే మీ సీఎం పీఠం లభించింది అంటూ పేర్కొన్నారు.
పంజాబ్ అభివృద్ధి కోసం సిద్ధూ నిరంతరం తపనపడుతుంటారు. స్వర్ణ పంజాబ్ సిద్ధూ కల. అందుకోసమే ఆయన జీవిస్తున్నారు. మీరు సత్యమార్గాన్ని నమ్మితే సిద్ధూ మీకు మద్దతిస్తారు. సత్యమార్గాన్ని విస్మరిస్తే ప్రతిఘటిస్తారంటూ పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను ఉద్దేశిస్తూ నవజ్యోత్ కౌర్ వరుస ట్వీట్లు చేశారు. 2022 ఫిబ్రవరిలో పంజాబ్‌లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. సీఎంగా భగవంత్ మాన్ బాధ్యతలు స్వీకరించారు. అయితే, కేంద్రంలో బీజేపీయేతర ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, ఆప్‌తో పాటు బీజేపీయేతర పార్టీలన్ని ఒకే తాటిపైకి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నారు. ఇలాంటి సమయంలో పంజాబ్‌లో కాంగ్రెస్, ఆప్ మధ్య మాటల యుద్ధం చర్చకు దారితీస్తుంది. రాష్ట్రంలో సఖ్యతలేకుండా కేంద్రంలో బీజేపీయేతర పక్షాల కూటమి ఎలా సాధ్యమన్న వాదన రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతుంది.