Mumbai Terror Attack : ముంబై ఉగ్రదాడి సూత్రధారి రాణాను భారత్‌కు అప్పగించాల్సిందే.. సుప్రీంకోర్టులో అమెరికా వాదన
తహవ్వుర్ రాణా(Rana).. 2008 సంవత్సరంలో మన ముంబైపై జరిగిన 26/11 ఉగ్రదాడికి(Mumbai Terror Attack) సూత్రధారి ఇతడే.
- By Pasha Published Date - 10:22 AM, Thu - 19 December 24

Mumbai Terror Attack : తహవ్వుర్ హుసేన్ రాణా(Rana).. 2008 సంవత్సరంలో మన ముంబైపై జరిగిన 26/11 ఉగ్రదాడికి(Mumbai Terror Attack) సూత్రధారి ఇతడే. పాకిస్తాన్ సంతతికి చెందిన ఇతగాడికి కెనడా పౌరసత్వం ఉంది. ముంబై ఉగ్రదాడి కేసు దర్యాప్తు మొదలయ్యాక.. ఇతగాడిని కెనడా సర్కారు అరెస్టు చేసింది. అనంతరం అమెరికాకు అప్పగించింది. ప్రస్తుతం అమెరికా జైలులోనే ఉన్నాడు. తాజాగా జో బైడెన్ ప్రభుత్వం రాణాకు షాక్ ఇచ్చింది. నవంబరు 13న అతడు అమెరికా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ ఆఫ్ సెర్షియోరారీని తిరస్కరించాలని సుప్రీంకోర్టును బైడెన్ సర్కారు కోరింది. ఈమేరకు అమెరికా సుప్రీంకోర్టులో ఆ దేశ సొలిసిటర్ జనరల్ ఎలిజబెత్ బి ప్రిలోగర్ 20 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేశారు. భారత్‌కు రాణాను అప్పగించక తప్పదని ఎలిజబెత్ వాదించారు. ఈ అప్పగింత నుంచి రక్షణ పొందే అర్హతలు రాణాకు లేవన్నారు. భారత్‌కు అప్పగింత నుంచి తనను కాపాడాలంటూ రాణా దాఖలు చేసిన రిట్ ఆఫ్ సెర్షియోరారీని కొట్టివేయాలని సుప్రీంకోర్టును అమెరికా సొలిసిటర్ జనరల్ కోరారు.
Also Read : Self Made Entrepreneurs : స్వయం కృషితో ఎదిగిన 200 మంది శ్రీమంతుల్లో 13 మంది తెలుగువారు
తహవ్వుర్ హుసేన్ రాణాను భారత్‌కు అప్పగించవచ్చని 2023 సంవత్సరంలో అమెరికాలోని కాలిఫోర్నియా జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తీర్పుపై అతడు అదే కోర్టులో వెంటనే రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. దానిపై మళ్లీ విచారించిన కాలిఫోర్నియా జిల్లా కోర్టు ఈ ఏడాది ఆగస్టు 17న మరోసారి తీర్పును ఇస్తూ.. తాము పాత తీర్పుకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. తహవ్వుర్ హుసేన్ రాణాను భారత్‌కు అప్పగించవచ్చని తేల్చి చెప్పింది. 2008 సంవత్సరంలో జరిగిన ముంబై ఉగ్రదాడి ఘటనతో 63 ఏళ్ల రాణాకు సంబంధం ఉన్నట్లుగా భారత్ అన్ని ఆధారాలను సమర్పించిందని కోర్టు అప్పట్లో వ్యాఖ్యానించింది. మొత్తం మీద అమెరికా సుప్రీంకోర్టు నుంచి త్వరలో వెలువడనున్న ఆదేశాలు ఉగ్రవాది తహవ్వుర్ హుసేన్ రాణా భవితవ్యాన్ని తేల్చనున్నాయి. ఒకవేళ తాజాగా అమెరికా సొలిసిటర్ జనరల్ వినిపించిన వాదనతో అక్కడి సుప్రీంకోర్టు ఏకీభవిస్తే.. రాణాను భారత్‌కు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయిపోతుంది. రాణాను భారత్‌కు అప్పగించడంపై సుప్రీంకోర్టు స్టే విధిస్తే.. న్యాయప్రక్రియ మరిన్ని నెలల పాటు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది.