Mumbai Rains : వర్షాలు ముంచెత్తిన ముంబై.. స్కూళ్లకు సెలవు, రైళ్లకు అంతరాయం!
Mumbai Rains : ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. శనివారం నుండి మొదలైన వర్షాలు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో నగరం జలమయం అయిపోయింది.
- Author : Kavya Krishna
Date : 18-08-2025 - 7:07 IST
Published By : Hashtagu Telugu Desk
Mumbai Rains : ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. శనివారం నుండి మొదలైన వర్షాలు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో నగరం జలమయం అయిపోయింది. సోమవారం ఉదయం కురిసిన వర్షం పరిస్థితిని మరింతగా విషమం చేసింది. రహదారులు, కాలనీలు అన్నీ నీటిలో మునిగిపోయి, రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. మోకాలి లోతు వరకూ నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించింది. విద్యార్థుల భద్రత దృష్ట్యా, ఉదయం సెషన్‌లో ఉన్న పిల్లలను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ముంబై సంరక్షక మంత్రి ఆశిష్ షెలార్ అధికారులు ఆదేశించారు.
Kota Rukmini: కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం.. కోట రుక్మిణి కన్నుమూత
ముంబై రవాణా వ్యవస్థకు వర్షాలు గట్టి సవాలుగా మారాయి. ముఖ్యంగా రైల్వే లైన్లు వర్షపు నీటితో నిండిపోవడంతో లోకల్ రైళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం సెంట్రల్, హార్బర్ రైల్వే లైన్‌లలో రైళ్లు 15 నుంచి 20 నిమిషాల ఆలస్యంతో నడుస్తున్నాయి. కుర్లా స్టేషన్ వద్ద పరిస్థితి విషమించవచ్చని అధికారులు హెచ్చరించారు. మరోవైపు రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. కుర్లా, సియోన్, కింగ్స్ సర్కిల్, హింద్మాతా, పరేల్, అంధేరి వంటి లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. దక్షిణ ముంబైలోని కింగ్స్ సర్కిల్‌లో మోకాలి లోతు వరకూ నీరు నిలిచిపోవడంతో వాహనాలు కదలకుండా నిలిచిపోయాయి. జేపీ రోడ్, మిలన్ సబ్‌వే, ఎల్‌బీఎస్ రోడ్‌లో కూడా వర్షపు నీరు ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వర్షం రాబోయే కొన్ని గంటల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. దీనితో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లొద్దని పోలీసులు పౌరులకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఏవైనా నీటిమునిగిన సంఘటనలు జరిగితే వెంటనే అత్యవసర నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. మొత్తంగా, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ముంబై నగరాన్ని పూర్తిగా అతలాకుతలం చేశాయి. సాధారణ ప్రజలు, ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే గంటల్లో వర్షం కొనసాగితే పరిస్థితి మరింతగా విషమించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Super Six – Super Hit : కూటమి పాలనలో అభివృద్ధికి అడ్డులేదు.. సంక్షేమానికి తిరుగులేదు