PM Modi: రేపు అయోధ్యకు మోడీ, పలు అభివృద్ధి పనులు ప్రారంభం
- By Balu J Published Date - 12:02 PM, Fri - 29 December 23

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. నూతనంగా నిర్మించిన మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అదేవిధంగా ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభించి నూతనంగా ప్రవేశపెట్టిన అమృత్ భారత్ రైళ్ళకు జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం 15వేల 700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.
కాగా అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠాపనకు హాజరవ్వాలా వద్దా అనే విషయంలో ప్రతిపక్ష ఇండియా కూటమిలో సందిగ్ధత నెలకొన్నది. కార్యక్రమానికి హాజరు కాకపోతే తమపై హిందూ-వ్యతిరేకులుగా ముద్ర పడుతుందేమోనని అవి భయపడుతున్నాయి. మరోపక్క హాజరైతే బీజేపీ చెప్పినట్టు ఆడాల్సి వస్తుందేమోనని ఆలోచిస్తున్నాయి. రామమందిర ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ తీసుకొనే నిర్ణయం 2024 ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందా అని కాంగ్రెస్ నేత శశిథరూర్‌ను మీడియా ప్రశ్నించినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ సందిగ్ధతను స్పష్టం చేశాయి.