Maharashtra : సీఎం పదవిపై మోడీ, అమిత్ నిర్ణయమే అంతిమం: ఏక్‌నాథ్ శిండే
బీజేపీ, మోడీ నాకు ఎప్పుడూ అండగానే ఉన్నారు. ముఖ్యమంత్రిగా రెండున్నరేళ్లుగా చేసిన పని సంతృప్తినిచ్చింది. నిత్యం బాల్‌ఠాక్రే మార్గంలోనే పయనించానని చెప్పారు.
- By Latha Suma Published Date - 04:42 PM, Wed - 27 November 24

Maharashtra: మహారాష్ట్రలో సీఎం పదవిని ఎవరు తీసుకుంటారనే దానిపై మహాయుతి కూటమిలో తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఏక్‌నాథ్ శిండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్‌డీఏ అధినేతగా ప్రధాని మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసాహిస్తానని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా తనతో ఫోన్‌లో మాట్లాడారని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు గురించి నా అభిప్రాయం తెలుసుకున్నారు. మీరు (మోడీ, అమిత్ షా) ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఆమోదమేనని చెప్పానని అన్నారు.
ప్రభుత్వ ఏర్పాటులో అడ్డంకిగా ఉండబోనని మోడీకి చెప్పినట్లు శిండే తెలిపారు. బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. బీజేపీ, మోడీ నాకు ఎప్పుడూ అండగానే ఉన్నారు. ముఖ్యమంత్రిగా రెండున్నరేళ్లుగా చేసిన పని సంతృప్తినిచ్చింది. నిత్యం బాల్‌ఠాక్రే మార్గంలోనే పయనించానని చెప్పారు. మహారాష్ట్ర ప్రజలు నన్ను కుటుంబసభ్యుడిలా భావించారు. నేను ఎప్పుడూ ప్రజల కోసమే పనిచేశానని. పదవుల కోసం కాదన్నారు. మా సంక్షేమ పథకాలు చూసిన తర్వాతే మళ్లీ పట్టం కట్టారు. నా దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్ అని.. నన్ను నేను ఎప్పుడూ సామాన్యుడిగానే భావిస్తాను అన్నారు. సీఎంగా కాకుండా సామాన్యుడిలా పనిచేశానని తెలిపారు.
కాగా, మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మహాయుతిలో భాగమైన కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే దేవేంద్ర ఫడ్నవీస్‌ను తదుపరి సీఎంగా సమర్థించారు. ఏక్ నాథ్ శిండే కేంద్ర ప్రభుత్వంలో చేరాలని అథవాలే ప్రతిపాదించారు. ఒకవేళ శిండే తిరస్కరించినట్లయితే బీజేపీ-ఎన్‌సీపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అథవాలే సూచించారు.
Read Also: Chandrababu : జేసీ ప్రభాకర్ రెడ్డిపై సీఎం చంద్రబాబు సీరియస్