BJP : బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నయినార్ నాగేంద్రన్ ఎన్నిక
ఈ ఎన్నిక వెనక కేంద్ర మంత్రి అమిత్ షా నిర్ణయాలు కీలకంగా పనిచేసినట్లుగా సమాచారం. చెన్నైలో నిర్వహించిన పార్టీ సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్‌లు ఈ మేరకు ప్రకటన చేశారు.
- By Latha Suma Published Date - 07:47 PM, Sat - 12 April 25

BJP : బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పార్టీ నేత, తిరునల్వేలి ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. నాగేంద్రన్ ఒక్కరి నుంచే నామినేషన్ రావడంతో ఆయనకే ఈ పదవి ఖరారైంది. ఈ ఎన్నిక వెనక కేంద్ర మంత్రి అమిత్ షా నిర్ణయాలు కీలకంగా పనిచేసినట్లుగా సమాచారం. చెన్నైలో నిర్వహించిన పార్టీ సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్‌లు ఈ మేరకు ప్రకటన చేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, అన్నాడీఎంకేలు జట్టుకట్టిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.
Read Also: TGPSC : బీఆర్‌ఎస్ నేతకు టీజీపీఎస్సీ నోటీసులు
నయినార్ నాగేంద్రన్ కన్యాకుమారి జిల్లా నాగర్‌కొయిల్ సమీపంలోని వడివీశ్వరంలో 1960లో జన్మించారు. తొలుత అన్నాడీఎంకేలో ఉన్న ఆయన.. అనంతరం బీజేపీలో చేరారు. 2020 జులై నుంచి కాషాయ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అన్నాడీఎంకే, బీజేపీలను సమన్వయం చేసుకోవడంలో నాగేంద్రన్ కీలకంగా వ్యవహరిస్తారని భావిస్తున్నారు. జయలలిత, పన్నీరుసెల్వం ప్రభుత్వాల్లో పలు శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రభుత్వ పాలన, ప్రజలతో మేమకం, రాజకీయాల్లో వ్యూహాలపై పట్టు ఉండటంతో.. అధిష్ఠానం ఆయన వైపు మొగ్గుచూపినట్లు విశ్లేషకుల అంచనా.
కాగా, ఇప్పటికే తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే, మధ్య పొత్తు కుదిరింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించినట్లు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో తాము తలదూర్చబోమని వెల్లడించారు. అధికారం, సీట్ల పంపకాలపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని వివరించారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధ్యక్షుడు పళనిస్వామి నేతృత్వంలో పనిచేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. కొన్ని అంశాల్లో అన్నాడీఎంకే వైఖరి భిన్నంగా ఉన్నా, చర్చల ద్వారా కనీస ఉమ్మడి ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తామని తెలిపారు.