Kashmir Elections : బీజేపీతో పొత్తుపై మెహబూబా ముఫ్తీ కీలక ప్రకటన
జమ్మూ కాశ్మీర్ లో ఏర్పాటయ్యే తదుపరి ప్రభుత్వంలో తప్పకుండా పీడీపీ కీలక పాత్ర పోషిస్తుందని మెహబూబా ముఫ్తీ విశ్వాసం వ్యక్తం చేశారు.
- By Pasha Published Date - 06:15 PM, Tue - 3 September 24
Kashmir Elections : త్వరలో జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చరిత్ర ఒకే ఒక్క జమ్మూకశ్మీర్ రాజకీయ పార్టీకి ఉంది. గతంలో ఒక్క పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) మాత్రమే బీజేపీతో కలిసి కశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, కాంగ్రెస్ ఇప్పటికే పొత్తు పెట్టుకున్నాయి. దీంతో పీడీపీ ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఏం చేయబోతోంది ? ఏ పార్టీకీ సరైన సీట్లు రాకుంటే పీడీపీ ఏం చేస్తుంది ? బీజేపీకి మద్దతు ఇస్తుందా ? కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇస్తుందా ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈతరుణంగా తాజాగా ఈరోజు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కీలక ప్రకటన చేశారు. తమ భవిష్యత్ ప్రణాళికపై క్లారిటీ ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో(Kashmir Elections) బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత కూడా బీజేపీతో ఎలాంటి పొత్తు కుదిరే ఛాన్సే లేదన్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఏర్పాటయ్యే తదుపరి ప్రభుత్వంలో తప్పకుండా పీడీపీ కీలక పాత్ర పోషిస్తుందని మెహబూబా ముఫ్తీ విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీనగర్‌లోని పీడీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీపై మెహబూబా ముఫ్తీ విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రావడమే ఆ పార్టీ ధ్యేయమన్నారు. 1947 నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధికారం కోసమే పాకులాడుతోందని పేర్కొన్నారు. మంత్రి పదవుల కోసమే ఆ పార్టీ పొత్తులు పెట్టుకుంటుందని ధ్వజమెత్తారు. తమ పార్టీ (పీడీపీ) మద్దతు లేకుండా కశ్మీర్‌లో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ముఫ్తీ పేర్కొన్నారు. 2002లో తాము కేవలం 16 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, ఈసారి కూడా కశ్మీర్‌లో అలాంటి పరిస్థితులే ఉన్నాయని తెలిపారు. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసమే గతంలో బీజేపీతో చేతులు కలిపామని.. కానీ కశ్మీర్ అభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రయత్నాలను బీజేపీ తోసిపుచ్చిందని ముఫ్తీ మండిపడ్డారు. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదన్నారు. కాగా, మెహబూబా ముఫ్తీ ఈ ప్రసంగంలో కేవలం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీపై మాత్రమే విమర్శలు గుప్పించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు. దీంతో కశ్మీర్‌లో ఎన్నికలు జరిగిన తర్వాత రాజకీయ సమీకరణాలు ఎలాంటి మలుపు తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు.
Related News
BJP : అమెరికాలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్
BJP: రాహుల్ గాంధీ కి భారత్ ను అవమానించడం అలవాటైపోయిందని దుయ్యబట్టింది. చైనాతో చేసుకున్న ఒప్పందం కారణంగా ఆయన అలా మాట్లాడుతున్నారని తీవ్ర విమర్శలు చేసింది బీజేపీ. సామాజిక ఉద్రిక్తతలను సృష్టించడానికే దేశాన్ని విభజించి పాలించాలని రాహుల్ భావిస్తూంటారని ఘాటుగా వ్యాఖ్యానించింది.