Manish Sisodia: ఈ రోజు నన్ను అరెస్టు చేస్తారు: ఢిల్లీ డిప్యూటీ సీఎం
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను (Manish Sisodia) సీబీఐ విచారిస్తోంది. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు దక్షిణ ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు.
- By Gopichand Published Date - 01:29 PM, Sun - 26 February 23

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను (Manish Sisodia) సీబీఐ విచారిస్తోంది. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు దక్షిణ ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు. మనీష్ సిసోడియా సిబిఐ కార్యాలయానికి వెళ్లేందుకు ఇల్లు వదిలి రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఆయనతో పాటు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఉన్నారు. సిసోడియాను విచారించిన తర్వాత అరెస్ట్ చేస్తారని ఆప్ నేతలు చెబుతున్నారు. కొన్ని నెలలు జైల్లో ఉండాల్సి వచ్చినా పట్టించుకోవడం లేదని సిసోడియా స్వయంగా చెప్పారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు ఈరోజు తనను అరెస్టు చేయబోతున్నారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చూసి భయపడుతోందని చెప్పారు. అందుకే తమపై తప్పుడు కేసులు పెట్టి మోదీ సర్కారు వేధిస్తోందని ఆరోపించారు. లిక్కర్ పాలసీ కేసులో తనను అరెస్టు చేసి, ఏడెనిమిది నెలలపాటు జైలులోనే ఉంచేస్తారని చెప్పారు.
Also Read: Asaduddin Owaisi: బీజేపీకి గత ఎన్నికల ఫలితాలే: అసదుద్దీన్ ఒవైసీ
సిసోడియా ట్వీట్‌పై అరవింద్ కేజ్రీవాల్ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు మనీష్. లక్షలాది మంది పిల్లలు, వారి తల్లిదండ్రుల ప్రార్థనలు మీ వెంట ఉన్నాయి. దేశం కోసం, సమాజం కోసం జైలుకు వెళ్లినప్పుడు జైలుకు వెళ్లడం శాపం కాదు, ఘనత. మీరు త్వరగా జైలు నుంచి తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. పిల్లలు, తల్లిదండ్రులు, ఢిల్లీలోని మేమంతా మీ కోసం వేచి ఉంటామని అన్నారు.
ఇంటి దగ్గర తన భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఒంటరిగా ఉందని, ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తలకు సూచించారు. ఢిల్లీ విద్యార్థులు బాగా చదువుకోవాలని, తల్లిదండ్రుల మాట ప్రకారం నడుచుకోవాలని సిసోడియా సూచించారు. సిసోడియాను ఇప్పటికే అధికారులు పలుమార్లు విచారించారు. అక్టోబర్ 17న సీబీఐ అధికారులు ఆయనను సుమారు 9 గంటల పాటు ప్రశ్నించారు. తాజాగా మరోమారు సిసోడియాను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అయితే, సిసోడియాను ఈ రోజు అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది.