CM Convoy Attacked : మణిపూర్ సీఎం కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. భద్రతా సిబ్బందికి గాయాలు
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగింది.
- By Pasha Published Date - 01:52 PM, Mon - 10 June 24

CM Convoy Attacked : మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగింది. సోమవారం ఉదయం కాంగ్‌పోక్పి జిల్లాలో సాయుధ ఉగ్రవాదులు ఆకస్మికంగా ఆయన కాన్వాయ్‌పై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో సీఎం భద్రతా సిబ్బందిలోని ఓ వ్యక్తి గాయపడ్డాడు. సీఎం కాన్వాయ్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ నుంచి జిరిబామ్ జిల్లా వైపు వెళ్తుండగా.. ఇవాళ ఉదయం 10.30 గంటలకు 37వ నంబరు జాతీయ రహదారిపై ఈ దాడి జరిగింది.
We’re now on WhatsApp. Click to Join
జిరిబామ్ జిల్లాలో జూన్ 6న గుర్తుతెలియని దుండగులు మెయితీ వర్గానికి చెందిన 59 ఏళ్ల రైతు సోయిబమ్ శరత్‌కుమార్ సింగ్ తల నరికి చంపారు. అప్పటి నుంచి ఆ జిల్లాలో అశాంతి నెలకొంది. రెండు వర్గాల ప్రజల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు దాదాపు 70 ఇళ్లు దగ్ధమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దీంతో భయాందోళనకు గురైన ఎంతో మంది ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని.. జిరిబామ్ జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఈనేపథ్యంలో ఇవాళ జిరిబామ్ జిల్లా కేంద్రానికి చేరుకొని.. హింసాత్మక ఘటనలు జరుగుతున్న గ్రామాలను రేపు (మంగళవారం) సందర్శించాలని సీఎం బీరేన్ సింగ్ (CM Convoy Attacked) భావించారు. జిరిబామ్ జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల సందర్శనకు మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ వెళ్తుండగా.. కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగింది.
Also Read : Terror Attack : కశ్మీర్ ఉగ్రదాడి మా పనే : పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్
జిరిబామ్ జిల్లాలో మెయితీ వర్గానికి చెందిన రైతు సోయిబమ్ శరత్‌కుమార్ సింగ్ హత్య తర్వాత స్థానికులు ఆగ్రహం పెల్లుబికింది. ప్రత్యేకించి మెయితీ వర్గానికి చెందిన వారు పెద్ద సమూహంగా ఏర్పడి స్థానిక పోలీసు స్టేషన్‌ను చుట్టుముట్టారు. తమ వద్ద ఉన్న లైసెన్సుడ్ ఆయుధాలను ఎన్నికల సమయంలో జప్తు చేశారని.. వాటిని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఆయుధాలు తిరిగి ఇచ్చేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. జిరిబామ్ జిల్లాలో ఇప్పటివరకు హింసాత్మక ఘటనలు జరగలేదు.ఈ జిల్లాలో పెద్ద సంఖ్యలో మెయితీలు, ముస్లింలు, నాగాలు, కుకీలు,మణిపురియేతరులు ఉంటారు. తాజా ఘటనతో అక్కడ కూడా పరిస్థితులు చేయి దాటొచ్చనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అందుకే అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దాలని సీఎం బీరేన్ సింగ్ భావించారు.