WB Elections : ఢిల్లీలో గద్దె దించుతా – మమత ధీమా
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం బెంగాల్‌లోనే కాకుండా
- Author : Sudheer
Date : 24-04-2026 - 1:09 IST
Published By : Hashtagu Telugu Desk
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుత ఎన్నికల వేళ బీజేపీపై యుద్ధం ప్రకటించారు. కేంద్రంలోని అధికార పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ఆమె వ్యాఖ్యలు చేసారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం బెంగాల్‌లోనే కాకుండా, కేంద్రంలో కూడా బీజేపీని గద్దె దించుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. “నన్ను ఓడించే సత్తా ఎవరికీ లేదు” అని స్పష్టం చేస్తూనే, దేశ రాజధాని ఢిల్లీలో మార్పు తీసుకురావడమే తన తదుపరి లక్ష్యమని ప్రకటించారు. ప్రజల హక్కుల కోసం, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తమను ఎవరూ అడ్డుకోలేరని, బెంగాల్ విజయం తర్వాత దేశ రాజకీయాల్లో కీలక మార్పులు వస్తాయని ఆమె జోస్యం చెప్పారు.
అధికారులపై ఆరోపణలు – పేర్లు నోట్ చేసుకున్నాం!
ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులపై మమత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేపథ్యం ఉన్న వ్యక్తులను కీలక పదవుల్లో నియమించారని ఆమె ఆరోపించారు. ఎవరైతే బీజేపీ కోసం తొత్తులుగా పని చేస్తున్నారో, వారందరి పేర్లను తాము నోట్ చేసుకున్నామని హెచ్చరించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి గెలవాలని చూస్తున్న బీజేపీ వ్యూహాలు బెంగాల్ గడ్డపై పారవని, అధికారుల అండతో ఎన్నికల్లో గెలవలేరని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే తమకు ప్రజల మద్దతు పుష్కలంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
అధికారం ముఖ్యం కాదు.. బిజెపి పతనం కావాలి
తనకు వ్యక్తిగత అధికారంపై ఆశ లేదని, కేవలం బీజేపీ పతనమే తన ప్రధాన అజెండా అని మమత స్పష్టం చేశారు. “నాకు పవర్ అవసరం లేదు, కానీ దేశానికి బీజేపీ పీడ వదలాలి” అని ఆమె వ్యాఖ్యానించారు. బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలను పెంచుతామని, తద్వారా ఢిల్లీ పీఠం నుంచి వారిని దించి తీరుతామని ఆమె ప్రతిజ్ఞ చేశారు. అన్యాయమైన పాలనకు స్వస్తి పలకడమే తమ లక్ష్యమని చెబుతూ, ఈ ఎన్నికలను మమతా బెనర్జీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.