Ram Mandir: అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి అద్వానీ
అయోధ్యలో జరిగే ఆలయ ప్రతిష్ఠాపనకు బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ హాజరవుతారని వీహెచ్‌పీ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు.
- Author : Praveen Aluthuru
Date : 11-01-2024 - 3:17 IST
Published By : Hashtagu Telugu Desk
Ram Mandir: అయోధ్యలో జరిగే రామ మందిరం ఆలయ ప్రతిష్ఠాపనకు బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ హాజరవుతారని వీహెచ్‌పీ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. జనవరి 22న అయోధ్యలో జరిగే ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అద్వానీని పిలవాలని బీజేపీ నిర్ణయించింది. అయితే ఈ వేడుకకు పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి హాజరవుతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
వీహెచ్‌పీ అధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడుతూ..అద్వానీ జీ వస్తానని చెప్పారు. అవసరమైతే, మేము అతని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని అన్నారు. అయితే ఎల్‌కే అద్వానీ ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా ఈ కార్యక్రమానికి రావద్దని కోరినట్లు రామ్ మందిర్ ట్రస్ట్ గతంలో తెలిపింది. అయితే 96 ఏళ్ల ఎల్‌కె అద్వానీ రామమందిర్ ప్రాణ్ ప్రతిష్ఠ వేడుకకు హాజరు కావాలని నిర్ణయించుకోవడం గమనార్హం. అయితే వయోభారం దృష్ట్యా కార్యక్రమం పూర్తయ్యేంత వరకూ ఆయన ఉండకపోవచ్చని తెలుస్తుంది. రామాలయ నిర్మాణానికి అడ్వాణి కృషి చేశాడు. అయోధ్యలో రామాలయం ఈ దశకు చేరుకోవడానికి అటల్ బీహారీ వాజ్‌పేయి, అడ్వాణి, జోషి కీలకమని చెప్తుంటారు.
అయోధ్యలో నెలకొల్పిన రామమందిరాన్ని జనవరి 22వతేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా వేలాది మంది వీక్షకులను ఆహ్వానించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు దలైలామా, మాతా అమృతానందమయి, యోగా గురువు బాబా రాందేవ్, సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, మాధురీ దీక్షిత్, అరుణ్ గోవిల్, ప్రభాస్, దర్శకుడు మాధుర్ భండార్కర్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేశ్ అంబానీతో సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆలయ ట్రస్టు ఆహ్వానించింది.
Also Read: Smartphone Offers: సంక్రాంతి బంపరాఫర్.. పోకో సీ55 ఫోన్ సగం ధరకే.. పూర్తి వివరాలవే?