CPM Chief : సీపీఎం సారథిగా ఎంఏ బేబీ.. ఆయన ఎవరు ?
కేరళ సీఎం విజయన్‌కు సన్నిహితులుగా ఎంఏ బేబీకి(CPM Chief) పేరుంది.
- Author : Pasha
Date : 06-04-2025 - 7:28 IST
Published By : Hashtagu Telugu Desk
CPM Chief : సీపీఎం కొత్త సారథి ఎవరో తేలిపోయింది. పార్టీ నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిగా 70 ఏళ్ల మరియం అలెగ్జాండర్ బేబీ నియమితులు అయ్యారు. ఆయన కేరళలోని కొల్లం జిల్లా ప్రక్కులాం వాస్తవ్యులు. కేరళ సీఎం విజయన్‌కు సన్నిహితులుగా ఎంఏ బేబీకి(CPM Chief) పేరుంది. ఇవాళ తమిళనాడులోని మదురై వేదికగా జరిగిన సీపీఎం మహాసభల్లో దీనిపై అధికారిక ప్రకటన చేశారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కోసం ఎంఏ బేబీ పేరును పార్టీ కోఆర్డినేటర్ ప్రకాశ్ కారత్ ప్రతిపాదించారు. దీనికి ముఖ్య నేతలు అందరూ మద్దతు తెలపడంతో ఎంఏ బేబీ ఎన్నిక ఖాయమైంది. మైనారిటీ వర్గం నుంచి సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తొలి నేత బేబీనే. గత ఏడాది సెప్టెంబర్‌లో సీతారాం ఏచూరి చనిపోయారు. దీంతో జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీ అయింది. ఇప్పటివరకు ఆ పదవిని కారత్ నిర్వహిస్తూ వచ్చారు.
Also Read :Missile Testing Center: ఏపీలో మిస్సైల్ టెస్టింగ్ సెంటర్.. ఎక్కడో తెలుసా ?
ఎంఏ బేబీ 1954 ఏప్రిల్ 5న జన్మించారు. ఇప్పుడు ఆయన వయసు 70 ఏళ్లు. కేరళలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)లో చేరికతో రాజకీయాల్లోకి బేబీ వచ్చారు. ఆ తర్వాత సీపీఎం యూత్ వింగ్ డీవైఎఫ్ఐలో ఆయన పనిచేశారు. 1986 నుంచి 1998 వరకు సీపీఎం రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థులను, యువతను సమీకరించారు. ఆ కారణంతో ఆయనకు జైలుశిక్షను విధించారు. తొలిసారిగా 2006లో కేరళలోని కుందర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 2006 నుంచి 2011 వరకు కేరళ రాష్ట్రంలో వీఎస్ అచ్యుతానంద్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2011లో తిరిగి కుందర నియోజకవర్గం నుంచే గెలుపొందారు. 2012 నుంచి సీపీఎం పొలిట్ బ్యూరోలో కొనసాగుతున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కొల్లాం స్థానం నుంచి పోటీ చేసి బేబీ ఓడిపోయారు.