CM Hemant Soren : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్.. నెక్ట్స్ సీఎం ఎవరంటే ?
CM Hemant Soren : భూకుంభకోణంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఎట్టకేలకు బుధవారం రాత్రి అరెస్టు చేశారు.
- By Pasha Published Date - 08:48 PM, Wed - 31 January 24

CM Hemant Soren : భూకుంభకోణంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను(CM Hemant Soren) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఎట్టకేలకు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. ఈడీకి చెందిన ఏడుగురు సభ్యుల బృందం ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రాంచీలోని హేమంత్ సోరెన్ నివాసంలో ఈ అరెస్టు జరిగింది. భూకుంభకోణంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో దాదాపు రెండు గంటలు ప్రశ్నించిన అనంతరం సీఎంను ఈడీ ఆఫీసర్లు కస్టడీలోకి తీసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join
అంతకుముందు ఈడీపై జార్ఖండ్ సీఎం ఫిర్యాదు మేరకు రాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత వారం తన ఢిల్లీ నివాసంపై ఈడీ దాడి చేసినందుకు హేమంత్ సోరెన్ ఫిర్యాదు చేశారు. ‘‘కొందరు సీనియర్ ఈడీ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై మేం ముఖ్యమంత్రి నుంచి ఫిర్యాదును స్వీకరించాం. అణగారిన వర్గానికి చెందిన తనను ఈడీ ఉద్దేశపూర్వకంగానే వేధిస్తోందని ఫిర్యాదులో హేమంత్ సోరెన్ పేర్కొన్నారు. ఈడీ అధికారులు అవమానించేలా చేసిన రైడ్స్ వల్ల మానసిక వేదనకు గురయ్యానని ప్రస్తావించారు’’ అని రాంచీ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక ఈడీ కస్టడీలోకి తీసుకున్న తర్వాత హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చంపై సోరెన్ తదుపరి జార్ఖండ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.మరోవైపు బుధవారం రాత్రి హుటాహుటిన రాష్ట్ర గవర్నర్ ఇంటికి జార్ఖండ్‌లోని అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు చేరుకున్నారు. చంపాయ్ సోరెన్‌ను తదుపరి ముఖ్యమంత్రిగా చేయాలని వారంతా గవర్నర్‌ను కోరారు. అందుకు గవర్నర్ అంగీకరించారు.
Also Read :Spy Pigeon : పావురం అరెస్ట్.. 8 నెలల తర్వాత విడుదల.. ఎందుకు ?
సీతా సోరెన్ వర్సెస్ కల్పనా సోరెన్
అంతకుముందు జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత, సీఎం హేమంత్ సోరెన్‌ను ఒకవేళ ఈడీ అరెస్టు చేస్తే తదుపరి సీఎంగా ఆయన భార్య కల్పనా సోరెన్ అవుతారనే ప్రచారం జరిగింది. అది తప్పని ఎట్టకేలకు నిరూపితం అయింది. కల్పనా సోరెన్‌ను సీఎంగా చేసే ప్రపోజల్‌ను హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ వ్యతిరేకించారనే టాక్ వినిపించింది. ఇంతకీ సీతా సోరెన్ ఎవరు అంటే.. హేమంత్ సోరెన్ అన్నయ్య దుర్గా సోరెన్ భార్య. ఈమె గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో 39 ఏళ్ల దుర్గా సోరెన్ చనిపోయారు. 2022 ఆగస్టులో జార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీత గళం విప్పారు.