Pahalgam Attack : ఇది కదా వార్తంటే.. ముగ్గురు పహల్గామ్ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్
Pahalgam Attack : గత రెండు నెలల క్రితం 26 మంది అమాయక పర్యాటకులను దారుణంగా హతమార్చిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ ఎన్‌కౌంటర్‌లో చిక్కుకున్నట్లు సమాచారం.
- By Kavya Krishna Published Date - 02:13 PM, Mon - 28 July 25

Pahalgam Attack : జమ్మూ కాశ్మీర్‌లోని హిర్వాన్లి – ద్వాస్ ప్రాంతంలో ప్రస్తుతం భీకర ఎన్‌కౌంటర్ జరుగుతోంది. గత రెండు నెలల క్రితం 26 మంది అమాయక పర్యాటకులను దారుణంగా హతమార్చిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ ఎన్‌కౌంటర్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ఉగ్రదాడికి లష్కరే తోయిబా (LeT) అనుబంధ సంస్థ ‘‘ది రెసిస్టెంట్ ఫ్రంట్ (TRF)’’ ఉగ్రవాదులే కారణమని భద్రతా సంస్థలు అప్పట్లోనే గుర్తించాయి.
ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి కాశ్మీర్‌లో పర్యటిస్తున్న 26 మంది టూరిస్టులు, మతం పేరుతో విచక్షణారహితంగా కాల్చివేయబడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఘటన తరువాత ఉగ్రవాదులు ప్రాంతాన్ని వదిలి పారిపోయి, పాకిస్తాన్‌లోని తమ మాస్టర్ల ఆదేశాల ప్రకారం గుప్తంగా దాక్కున్నట్లు గూఢచారి సంస్థలు అంచనా వేసాయి.
ఈ దారుణానికి బాధ్యులైన ఉగ్రవాదులను కనుగొని శిక్షించేందుకు భారత భద్రతా బలగాలు ‘‘ఆపరేషన్ మహదేవ్’’ పేరుతో విస్తృత సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా సైన్యం, సీఆర్పీఎఫ్ (CRPF), రాష్ట్ర పోలీసుల బృందాలు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించాయి. అనుమానిత ప్రాంతాలను ముట్టడి చేస్తూ, ఉగ్రవాదుల కదలికలను పర్యవేక్షించాయి.
తాజాగా హిర్వాన్లి – ద్వాస్ అడవి ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై స్పష్టమైన సమాచారం అందడంతో ప్రత్యేక దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మట్టుపడ్డారని తెలిసింది. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Uttar Pradesh : ఆలయంలో తొక్కిసలాట.. ఇద్దరి మృతి..మరో 19 మందికి తీవ్ర గాయాలు
ఈ ఆపరేషన్‌లో భారత సైన్యంతో పాటు సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సమన్వయంతో పాల్గొంటున్నారు. అత్యాధునిక డ్రోన్లు, నైట్ విజన్ పరికరాలను ఉపయోగించి ముట్టడిని కట్టుదిట్టం చేశారు. భద్రతా దళాలు ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసి ఉగ్రవాదుల పరారికి అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నాయి.
ఈ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో స్థానిక ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. పర్యాటకులను కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఉగ్రదాడి తర్వాత పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడగా, ఈ ఉగ్రవాదుల మట్టుపడడం స్థానిక ప్రజల్లో కొంత భరోసా కలిగిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
భారత భద్రతా బలగాలు TRF వంటి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలపై కఠినమైన చర్యలు కొనసాగిస్తున్నాయి. గూఢచారి సంస్థలు పాకిస్తాన్ నుంచి ఆయుధాలు, నిధులు అందిస్తున్న నెట్‌వర్క్‌లను ట్రాక్ చేస్తూ, అనేక క్షుద్ర దాడులను అడ్డుకున్నాయి. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, లష్కరే తోయిబా అనుబంధ గ్రూపులు భారత భూభాగంలో చొరబడే ప్రయత్నాలను పెంచుతున్నాయి.
ముగ్గురు ఉగ్రవాదులు మట్టుపడ్డారనే వార్త వెలువడినప్పటికీ, అధికారిక ధృవీకరణ కోసం దేశ ప్రజలు వేచి చూస్తున్నారు. ఆపరేషన్ మహదేవ్ పూర్తయి, ఈ దాడికి పాల్పడిన వారిని పూర్తిగా నిర్మూలించినప్పుడే దేశానికి న్యాయం జరుగుతుందని సైన్యం స్పష్టం చేసింది.
Srisailam Dam : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు..మూడు గేట్ల ద్వారా నీటి విడుదల