Vistara Airlines: ఎయిర్ విస్తారా విమానంలో ఇటలీ మహిళ హల్ చల్.. సిబ్బందితో గొడవ
విమానాల్లో అకస్మాత్తుగా వింత ఘటనలు తెరపైకి వస్తున్నాయి. ఈసారి అబుదాబి నుంచి ముంబైకి వస్తున్న ఎయిర్ విస్తారా విమానం (Vistara Airlines)లో ఇటలీకి చెందిన ప్రయాణికురాలు హంగామా చేసింది. ఎకానమీ టికెట్ తీసుకుని.. బిజినెస్ క్లాస్ సీటులో కూర్చుంది. సీటు తనది కాదని విమాన సిబ్బంది చెప్పడంతో వారితో వాగ్వాదానికి దిగింది.
- Author : Gopichand
Date : 31-01-2023 - 10:54 IST
Published By : Hashtagu Telugu Desk
విమానాల్లో అకస్మాత్తుగా వింత ఘటనలు తెరపైకి వస్తున్నాయి. ఈసారి అబుదాబి నుంచి ముంబైకి వస్తున్న ఎయిర్ విస్తారా విమానం (Vistara Airlines)లో ఇటలీకి చెందిన ప్రయాణికురాలు హంగామా చేసింది. ఎకానమీ టికెట్ తీసుకుని.. బిజినెస్ క్లాస్ సీటులో కూర్చుంది. సీటు తనది కాదని విమాన సిబ్బంది చెప్పడంతో వారితో వాగ్వాదానికి దిగింది. నాలుగు గంటలపాటు సిబ్బందిని, ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన ఆ మహిళను ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే విమాన సిబ్బంది పోలీసులకు అప్పగించారు.
వాస్తవానికి మహిళ ఎకానమీ క్లాస్ టిక్కెట్‌తో ఫ్లైట్ ఎక్కింది. కానీ బిజినెస్ క్లాస్‌లో కూర్చుంటా అని పట్టుబట్టింది. క్యాబిన్ సిబ్బంది ఆమెని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో దుమారం రేపింది. సిబ్బందితో కూడా గొడవ పడింది. దింతో ఇటలీకి చెందిన 45 ఏళ్ల పావోలా పెరూసియో అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు.
సోమవారం (జనవరి 30) ఎయిర్ విస్తారా ఫ్లైట్ UK 256 క్యాబిన్ సిబ్బంది నుండి తమకు ఫిర్యాదు అందిందని సహార్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. అదే రోజు తెల్లవారుజామున 2.03 గంటలకు అబుదాబి నుంచి విమానం బయలుదేరింది. రాత్రి 2:30 గంటల ప్రాంతంలో ఎకానమీ క్లాస్‌లో కూర్చున్న మహిళ అకస్మాత్తుగా లేచి బిజినెస్ క్లాస్‌లో కూర్చున్నట్లు సిబ్బంది పేర్కొన్నారు. క్యాబిన్ క్రూలోని ఇద్దరు సభ్యులు ముందుగా వెళ్లి ఆ మహిళతో మాట్లాడారు. సిబ్బంది ఒకరు ఆమెను తన సీటుకు తిరిగి రావాలని కోరారు.
ఇంతలో మహిళ అతనిని దుర్భాషలాడడం ప్రారంభించింది. అసభ్య పదజాలం ఉపయోగించవద్దని అతను మహిళకు చెప్పడంతో మహిళ.. ఒక సిబ్బంది ముఖంపై కొట్టి మరొకరిపై అసభ్యంగా ప్రవర్తించింది. కొద్దిసేపటికి మిగిలిన సిబ్బంది వచ్చేసరికి మహిళ తన బట్టలు విప్పి, విమానం కారిడార్‌లో నడవడం ప్రారంభించింది. సుదీర్ఘ గొడవ తర్వాత మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కాగానే, మహిళా ప్రయాణికురాలిని విస్తారా భద్రతా అధికారులకు, ఆపై సహర్ పోలీసులకు అప్పగించారు.