Himachal Polls: హిమాచల్‌లో ఆప్ దెబ్బ ఎవరికో..?
మంచుకొండల్లో ఎన్నికల వేడి రాజుకుంది.
- By Naresh Kumar Published Date - 02:27 PM, Wed - 9 November 22

మంచుకొండల్లో ఎన్నికల వేడి రాజుకుంది. కేజ్రీవాల్ ఎంట్రీతో హిల్ స్టేట్‌లో ఎలక్షన్ ఫైట్ రసవత్తరంగా మారింది. ఓట్ల వేటలో హోరాహోరీ తలపడుతున్నాయి మూడు ప్రధాన పార్టీలు. ఈ పోరులో ఆమ్ ఆద్మీ పార్టీ అరంగేట్రం ఎవరి కొంపముంచనుంది..? హోరాహోరీ ప్రచారాలు, అగ్రనేతల పర్యటనలు, భారీ హామీలు, అసంతృప్తి సెగలు.. హిమాచల్ ప్రదేశ్‌లో ఎలక్షన్ హీట్ పీక్‌కు చేరింది. డబుల్ ఇంజిన్ భరోసాతో బీజేపీ, ఆనవాయితీపై ఆశలతో కాంగ్రెస్.. మార్పు అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ.. ప్రజల్లోకి వెళుతున్నాయి.
హిమాచల్ స్వింగ్ స్టేట్. 1985 నుంచి వరుసగా రెండోసారి ఒకే పార్టీకి అధికారం దక్కిన దాఖలాలు లేవు. ఈ సంప్రదాయాన్ని బద్దలుకొట్టి .. 2017 ఫలితాలు రిపీట్ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది భారతీయ జనతా పార్టీ. 2021లో హిమాచల్ ప్రదేశ్‌లో ఒక లోక్‌సభ, 3 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో బీజేపీ గేరు మార్చింది. హిమాలయ రాష్ట్రంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వరుస పర్యటనలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, 3 దశాబ్దాల ఆనవాయితీని బలంగా నమ్ముకుంది కాంగ్రెస్ పార్టీ.
Also Read: ED New Target: టీఆర్ఎస్ మంత్రికి బీజేపీ `ఈడీ` గాలం?
జనరల్ సెక్రటరీ ప్రియాంక వాద్రా, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బగేల్ ప్రచారంలో పాల్గొంటున్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలను లేవనెత్తుతున్నారు. పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అయితే.. దిగ్గజ నేత వీరభద్రసింగ్ మరణం.. కాంగ్రెస్‌కు పెద్దలోటుగా మారింది. శక్తివంతమైన నేత లేకపోవడంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయి. పెద్దసంఖ్యలో నేతలు కమలం గూటికి చేరిపోయారు. సీఎం కుర్చీ కోసం పోటీపడుతున్న నేతలు.. కాంగ్రెస్ విజయంపై మాత్రం దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సంప్రదాయంగా హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు అంటే బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో సమీకరణాలు మారాయి. అనూహ్యంగా సత్యేంద్ర జైన్ జైలుపాలవడంతో.. ఆప్ ప్రచార జోరు తగ్గింది. కేజ్రీవాల్, సిసోడియా, రాఘవ్ చద్దా లాంటి నేతలు గుజరాత్‌పై ఫోకస్ పెట్టారు. 67స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టినా.. హిమాచల్‌లో ఆప్ పెద్దగా ప్రభావం చూపే ఛాన్స్ లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే కేజ్రీవాల్ పార్టీ చీల్చిన ఓట్లు ఎవరికి నష్టం చేస్తాయనేదే అసలు సవాల్. హిమాచల్ ప్రదేశ్‌లో ఆప్ ఎవరికి షాక్ ఇస్తుందో తెలియాలంటే డిసెంబర్ 8 వరకూ ఆగాల్సిందే.
Also Read: US Midterm Elections Result 2022: అమెరికాలో మధ్యంతర ఎన్నికలు, బైడెన్ పాలనకు పరీక్ష