Uttarakhand : నకిలీ బాబాలపై ఉక్కుపాదం..‘ఆపరేషన్ కాలనేమి’తో 14 మంది అరెస్టు
ఇప్పటివరకు ఈ ఆపరేషన్ కింద 14 మంది నకిలీ బాబాలను అరెస్ట్ చేశారు. వీరిలో కొందరు బంగ్లాదేశ్ పౌరులు కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది జూలైలో ప్రారంభమైన ఆపరేషన్ కాలనేమి కింద ఇప్పటివరకు రాష్ట్రంలోని 5,500 మందికిపైగా వ్యక్తులను పోలీసులు విచారించారు.
- By Latha Suma Published Date - 03:31 PM, Mon - 8 September 25

Uttarakhand : ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న, మత మార్పిడులకు పాల్పడుతున్న నకిలీ బాబాలను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేకంగా ‘ఆపరేషన్ కాలనేమి’ను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇది ఓ ఘన విజయంగా నిలుస్తోంది. ఇప్పటివరకు ఈ ఆపరేషన్ కింద 14 మంది నకిలీ బాబాలను అరెస్ట్ చేశారు. వీరిలో కొందరు బంగ్లాదేశ్ పౌరులు కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది జూలైలో ప్రారంభమైన ఆపరేషన్ కాలనేమి కింద ఇప్పటివరకు రాష్ట్రంలోని 5,500 మందికిపైగా వ్యక్తులను పోలీసులు విచారించారు. ఈ విచారణల అనంతరం 1,182 మందిపై పోలీస్ చర్యలు తీసుకున్నారు. ఆగస్టులో మాత్రమే 4,000 మందిని ప్రశ్నించగా, అందులో 300 మందిని అరెస్టు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
Read Also: YS Sharmila : నా కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు : వైఎస్ షర్మిల
ఈ విషయంపై ఐజీపీ భరానే మాట్లాడుతూ..దేవభూమి పవిత్రతను కాపాడటమే ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం. పెద్దఎత్తున విచారణలు జరిపాం. అనుమానాస్పదంగా ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.అని తెలిపారు. హరిద్వార్‌లో 2,704 మందిని తనిఖీ చేయగా ముగ్గురిని అరెస్టు చేశారు. డెహ్రాడూన్‌లో 922 మందిని తనిఖీ చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. టెహ్రీ, పౌరి, అల్మోరా, నైనిటాల్ వంటి ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో పలు షాకింగ్ అంశాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా విదేశీ పౌరులు నకిలీ గుర్తింపు పత్రాలతో భారత్‌లో మకాం వేసి, ప్రజలను మోసం చేస్తున్న క్రమం అధికారులు బయటపెట్టారు. ఉదాహరణకు, బంగ్లాదేశ్‌కు చెందిన అమిత్ కుమార్ బెంగాలీ అనే వ్యక్తి, వైద్యుడిగా నటిస్తూ సెలాకీలో గత ఎనిమిదేళ్లుగా నివసిస్తున్నాడు. అతను నకిలీ డాక్యుమెంట్లను ఉపయోగించి తన చట్టవిరుద్ధ కార్యకలాపాలను సాగిస్తున్నట్టు గుర్తించారు. ఆధారాలన్నింటిని సేకరించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
అలాగే, జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌కు చెందిన ఇఫ్రాజ్ అహ్మద్ తన మతాన్ని దాచి, హిందువుగా ప్రవర్తిస్తూ మత మార్పిడికి పాల్పడుతున్నట్టు గుర్తించారు. అతనిపై సంబంధిత చట్ట ప్రకారం కేసు నమోదు చేశారు. ఇక, ఢిల్లీకి చెందిన రాజ్ అహుజా అనే వ్యక్తి ధనవంతుడిగా నటిస్తూ మహిళలను మోసం చేస్తున్నట్టుగా తేలింది. అతను పలు ప్రాంతాల్లో తనను పవిత్ర బాబాగా చాటించుకుంటూ, మానసికంగా బలహీనంగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. సెలాకీలో అతనిని కూడా అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్ పోలీసులు చేపట్టిన ఈ ‘ఆపరేషన్ కాలనేమి’ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మతం, ఆధ్యాత్మికత పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఈ నకిలీ బాబాలు దేవభూమి గౌరవాన్ని దిగజారేలా చేస్తున్నారని, వీరిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి చర్యల ద్వారా ప్రజల మద్దతుతోనే పుణ్యక్షేత్రాల గౌరవాన్ని కాపాడతామని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా చూస్తామని ఐజీపీ భరానే స్పష్టం చేశారు.