India UPI In France : ఇక ఈఫిల్ టవర్ లోనూ ఇండియా యూపీఐ
India UPI In France : UPI (యూపీఐ).. ఇండియాలో తెలియనిది ఎవరికి !!
- By Pasha Published Date - 09:29 AM, Fri - 14 July 23

India UPI In France : UPI (యూపీఐ).. ఇండియాలో తెలియనిది ఎవరికి !!
ఫోన్ లో ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా పేమెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ UPI గురించి తెలుసు..
ఇప్పుడు ఈ UPI పేమెంట్స్ ఫ్రాన్స్ లో కూడా స్టార్ట్ కాబోతున్నాయి..
UPI ద్వారా జరిపే పేమెంట్స్ ఇకపై ఫ్రాన్స్ దేశంలో కూడా చెల్లుతాయి.
ప్రతి సంవత్సరం ఎంతోమంది ఇండియా టూరిస్టులు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఉన్న ఈఫిల్ టవర్ చూడటానికి వెళ్తుంటారు. ఇకపై అక్కడ UPI ద్వారా పేమెంట్స్ ను అంగీకరించనున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ పారిస్‌లోని లా సీన్ మ్యూజికేల్ ఆడిటోరియంలో ప్రవాస భారతీయులతో జరిగిన మీటింగ్ లో ఈవిషయాన్ని ప్రకటించారు. “ఇక మీరు ఈఫిల్ టవర్ దగ్గర కూడా ఫోన్ తీసి UPI పేమెంట్స్ చేయొచ్చు” అని ఆయన వెల్లడించారు. ఫ్రాన్స్ లో చదువుకుంటున్న ఎంతోమంది భారతీయ స్టూడెంట్స్ కు కూడా ఈ మార్పు ఎంతో హెల్ప్ చేస్తుందని చెప్పారు. UPI చెల్లింపు విధానాన్ని ఉపయోగించడానికి భారతదేశం, ఫ్రాన్స్ మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. గజిబిజిగా ఉన్న ఫారెక్స్ కార్డ్‌ల స్థానాన్ని రానున్న రోజులలో UPI (India UPI In France) భర్తీ చేస్తుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.
సింగపూర్, యూఏఈ, భూటాన్, నేపాల్ లలోనూ యూపీఐ
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) 2016 ఏప్రిల్ లో 21 సభ్య బ్యాంకులతో కలిసి UPI చెల్లింపు విధానాన్ని లాంచ్ చేసింది. అప్పటి నుంచి UPI వినియోగం విపరీతమైన వృద్ధిని సాధించింది. ఒక కప్పు టీకి కూడా UPI చెల్లింపులు చేస్తున్న పరిస్థితులు ప్రసుతం ఉన్నాయి. 2022లో మన దేశానికి చెందిన NPCI.. ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆన్‌లైన్ చెల్లింపు వ్యవస్థ “లైరా” మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దీంతో ఫ్రాన్స్ లో యూపీఐ పేమెంట్స్ కు లైన్ క్లియర్ అయింది. ఈ సంవత్సరం (2023లో) సింగపూర్ యొక్క PayNow, NPCI మధ్య కూడా ఒప్పందం జరిగింది. యూఏఈ, భూటాన్, నేపాల్ దేశాలు ఇప్పటికే యూపీఐ విధానాన్ని వినియోగిస్తున్నాయి. త్వరలో అమెరికా, యూరోపియన్ దేశాలు, పశ్చిమ ఆసియా దేశాలకు కూడా UPI సేవలను విస్తరించే దిశగా చర్చలు జరుగుతున్నాయి.