I.N.D.I.A : ప్రతిపక్షాల ఐక్యత ఎంత దూరం వచ్చింది?
- By Sudheer Published Date - 11:11 AM, Sat - 13 January 24

డా.ప్రసాదమూర్తి
అటు చూస్తే అధికార బిజెపి రాముడు, రామ మందిరం చుట్టూ రాజకీయాల మహా ప్రభంజనం సృష్టించి ఆ ప్రభంజనంలో విపక్షాలు కొట్టుకుపోయేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇటు చూస్తే ప్రతిపక్షాలు పేరుకు ఇండియా బ్లాక్ అని కూటమి పెట్టుకున్నాయి గాని, ఆ కూడిక ఇంకా పూర్తిస్థాయిలో జరిగిన ఆనవాళ్లు కనిపించడం లేదు. మరి ఈ నేపథ్యంలో బిజెపిని తట్టుకొని ప్రతిపక్షాలు ఒక్కటై ఐక్యంగా మరో మూడు నాలుగు నెలల్లో రాబోతున్న సార్వత్రిక ఎన్నికలలో పోరాటం సాగించగలవా అనేది ఇప్పుడు దేశం ముందున్న పెద్ద ప్రశ్న. బాబ్రీ మసీదు వివాదం సమసిపోయి, రామ జన్మభూమిలో రామ మందిరం వెలసి ఇక రాముడు చుట్టూ ఈ దేశంలో ఎలాంటి మత వివాదం తలెత్తడానికి అవకాశం లేదు అనుకునే సందర్భంలో, ఇంకా రాముడే దేశంలోని రాజకీయాల కేంద్ర బిందువుగా ఉన్నాడన్న విషయం మళ్ళీ మళ్ళీ పాలకులు గుర్తు చేస్తున్నారు. అంటే దేశ రాజకీయాలను నిర్ధేశించేది రాముడే గానీ రాజకీయ పార్టీలు కాదని చెప్పడానికి అధికార బిజెపి అహర్నిశలూ కృషి చేస్తుందని మనకు అర్థమవుతుంది. మరి ఇలా రాముడితో ముడిపెట్టిన రాజకీయాలను ఎలా ఎదుర్కోవాలో ఇంకా ప్రతిపక్షాలు ఒక స్పష్టమైన వైఖరిని తీసుకోవడంలో సఫలమైనట్టు కనిపించడం లేదు. ప్రతిపక్షాల ముందు రెండే రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి బీజేపీ వారు సాగిస్తున్న మత రాజకీయాలను సమర్ధంగా ఎదుర్కోవడం. రెండు, దేశం ఎదుర్కొంటున్న సమస్యలే ముఖ్యమని మతం కాదు దేవుడు కాదని సమర్థంగా ప్రజల మధ్యకు తీసుకువెళ్లడం. ఇలా ఈ రెండు లక్ష్యాలను సమర్ధంగా శక్తివంతంగా నెరవేర్చాలంటే ముందు ప్రతిపక్షాలు వజ్రతుల్యమైన బలోపేతమైన ఐక్యతను ప్రదర్శించాలి.
We’re now on WhatsApp. Click to Join.
ఒక కొలిక్కి రాని ఐక్యతా ప్రయత్నాలు:
బిజెపి సాగిస్తున్న రామ మందిర రాజకీయానికి సమాంతరంగా రాహుల్ గాంధీ భారత న్యాయయాత్రను కొనసాగించబోతున్నారు. ఈ యాత్ర సందర్భంగా మణిపూర్ నుంచి అనేక రాష్ట్రాలను చుట్టుముట్టి ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పట్ల వారిని చైతన్యం చేయడమే రాహుల్ లక్ష్యం. అంటే మందిర రాజకీయం కాదు మంది రాజకీయం ముఖ్యమని చెప్పడమే రాహుల్ ఉద్దేశం. దీన్ని రాహుల్ గాంధీ ఎంత సమర్థంగా నిర్వహిస్తారో మనం వేచి చూడాలి. అయితే ఇది ఒక పార్శ్వం మాత్రమే. రెండవది, అసలైనది ప్రతిపక్షాలు తమ ఐక్యత సాధనలో ఎన్ని అడుగులు ముందుకు వేశాయి అనేది ముఖ్యం. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలతో సీట్లు సర్దుబాటు చేసుకోవలసిన అతి కీలకమైన అంశం ఇంకా అపరిష్కృతం గానే ఉంది. బెంగాల్ ఉత్తరప్రదేశ్ బీహార్ కేరళ మహారాష్ట్ర వంటి కీలకమైన రాష్ట్రాలలో, కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న ఇతర పార్టీలతో ఇచ్చుపుచ్చుకునే ధోరణితో సీట్ల సర్దుబాటు చేసుకోవాలి. ఈ విషయంలో ఇంకా ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. మరోపక్క ప్రతిపక్షాల ఇండియా కూటమికి కన్వీనర్ గా బీహార్ ముఖ్యమంత్రి జనతాదళ్ (యు) నేత నితీష్ కుమార్ ను ప్రకటించకపోవడం పట్ల ఆ పార్టీ గుర్రుగా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ ముందస్తుగానే తమ అభిప్రాయాలు వ్యక్తం చేసి కూటమిలో కొంత అసమ్మతికి కారణమయ్యారు. ప్రధాని అభ్యర్థి విషయంలో అప్పుడే కంగారు పడాల్సింది లేదని కాంగ్రెస్ పార్టీ వారు సర్ది చెప్పడంతో ఆ తమాషా సద్దుమణిగింది. కానీ ప్రతిపక్షాల ఐక్యతకు అసలైన అడ్డంకి సీట్ల సర్దుబాటు. మరి ఈ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. బెంగాల్లో రెండు సీట్లకు మించి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వమని తృణమూల్ కాంగ్రెస్ తెగేసి చెప్పింది. దీంతో కాంగ్రెస్ మొహం మాడ్చుకుంది. ఇలా అనేక రాష్ట్రాల్లో చాలా సమస్యలే తలెత్తుతాయి. అన్నిటికంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో, అలాగే ఇతర పార్టీలు కాంగ్రెస్ పార్టీతో సీట్ల ఒప్పందానికి వస్తేనే ప్రతిపక్షాలు ఒక తాటి మీద నిలబడి, అధికార బిజెపిని ఢీకొనగలవు. ఈ విషయంలో మల్లికార్జున ఖర్గే ఇతర ప్రతిపక్షాల నాయకులతో వ్యక్తిగతంగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే నితీష్ కుమార్ ని, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ని, శివసేన నాయకులు ఉద్ధవ్ ఠాకరేని ఆయన కలిశారు. ఇతర విపక్షాల నాయకులను కూడా ఆయన కలుస్తున్నారు. అందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తలమునకులయ్యారు. ఏది ఏమైనా సీట్ల ఒప్పందం కుదుర్చుకొని, ఒక ఉమ్మడి ఎజెండాతో ప్రతిపక్షాలు కార్యరంగంలోకి దూకడానికి ఇక ఎంత మాత్రం ఆలస్యం చేసినా, ఆ ఆలస్యం అమృతం విషం అన్నట్టుగా మారిపోతుంది. అటు రామ మందిరం రాజకీయాన్ని ఎదుర్కోవడానికి, దేశంలోని ఇతర సమస్యలను ముందుకు తీసుకువచ్చి ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోరాటం చేయాలంటే ముందు సీట్ల ఒప్పందంలో అందరూ ఒక మాట మీదకి రావాలి. మరి ఈ ప్రయత్నాల్లో ప్రతిపక్షాలు ఎంత తొందరగా సఫలమైతే అన్ని విజయాలను అందుకోగలుగుతారు. లేదంటే బిజెపి ప్రభంజనాన్ని తట్టుకోలేక మరింత చల్లాచెదురైపోతారు.
Read Also :