India Vs Maldives : మాల్దీవులకు భారత్ చెక్.. లక్షద్వీప్‌లో రెండు సైనిక స్థావరాల ఏర్పాటు
India Vs Maldives : మాల్దీవుల అల్టిమేటం నేపథ్యంలో మే నెలకల్లా ఆ దేశం నుంచి భారత సైన్యం వెనక్కి వచ్చేయనుంది.
- By Pasha Published Date - 12:28 PM, Wed - 14 February 24

India Vs Maldives : మాల్దీవుల అల్టిమేటం నేపథ్యంలో మే నెలకల్లా ఆ దేశం నుంచి భారత సైన్యం వెనక్కి వచ్చేయనుంది. చైనా ప్రభావంతోనే తమ దేశం నుంచి భారత సైన్యాన్ని మాల్దీవులు పంపించేస్తోంది అనే విషయం విస్పష్టం. ఈనేపథ్యంలో మాల్దీవులకు ప్రత్యక్షంగా, చైనాకు పరోక్షంగా చెక్ పెట్టేందుకు భారత్ అనూహ్యమైన నిర్ణయం తీసకుంది. అదేమిటంటే.. మాల్దీవుల నుంచి కేవలం 800 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్షద్వీప్‌లో వైమానిక, నౌకాదళ స్థావరాలను ఏర్పాటు చేయాలని భారత్ డిసైడైంది. ఈ నిర్ణయం మాల్దీవులకు పెద్ద షాక్ ఇవ్వనుంది. లక్షద్వీప్‌లోని అగట్టి, మినీకాయ్ దీవుల్లో వైమానిక, నౌకాదళ స్థావరాలు ఏర్పాటవుతాయని తెలుస్తోంది. మినీకాయ్ దీవులు మాల్దీవులకు కేవలం 524 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అక్కడ భారత వాయుసేన, నౌకాదళానికి సంబంధించిన స్థావరాలు ఏర్పాటవుతాయి. దీంతో మాల్దీవుల పరిసరాల్లోని హిందూ మహాసముద్ర జలాల్లో చైనా సైన్యం ఉనికిపై భారత్(India Vs Maldives) నిరంతర నిఘా పెట్టేందుకు మార్గం సుగమం అవుతుంది.
We’re now on WhatsApp. Click to Join
కొత్త ప్రపోజల్స్‌లో భాగంగా.. లక్షద్వీప్‌లోని మినికాయ్ దీవుల్లో నూతన వైమానిక స్థావరాన్ని భారత్ ఏర్పాటు చేయనుంది. అగట్టి దీవుల్లో ఇప్పటికే ఉన్న వైమానిక స్థావరాన్ని అప్‌గ్రేడ్ చేసి.. అక్కడ నేవీకి సబంధించిన యుద్ధనౌకలను మోహరించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. మార్చి 4, 5 తేదీల్లో లక్షద్వీప్‌లోని మినికాయ్ దీవుల్లో పర్యటించనున్న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. కొత్త వైమానిక స్థావరం ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేస్తారని అంటున్నారు. మినీకాయ్ దీవుల్లో వైమానిక స్థావరంతో పాటు INS జటాయు పేరుతో నౌకాదళ స్థావరం ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. భారతదేశం తన నౌకాదళం శక్తిని ప్రదర్శించేందుకుగానూ 15 యుద్ధనౌకలతో కూడిన రెండు విమాన వాహక నౌకలపై మార్చి 6, 7 తేదీల్లో కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించనుంది. మరోవైపు గ్రేట్ నికోబార్‌లోని క్యాంప్‌బెల్ బేలో కొత్త సౌకర్యాలతో అండమాన్ నికోబార్ దీవులలో భారతదేశం ఇప్పటికే తన బలగాల సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తోంది. లక్షద్వీప్, మినికాయ్ దీవులను అప్‌గ్రేడ్ చేసే చర్య హిందూ మహా సముద్ర జలాల్లో వాణిజ్య నౌకలను రక్షించేందుకు, ద్వీప భూభాగాల్లో మౌలిక సదుపాయాల నవీకరణకు, టూరిజం వికాసానికి కొత్తబాటలు వేయనుంది.