India Vs Canada : 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి పిలుచుకోండి.. కెనడాకు భారత్ వార్నింగ్ ?
India Vs Canada : భారత్ - కెనడా మధ్య దౌత్యపరమైన యుద్ధం మరింత ముదురుతోంది.
- Author : Pasha
Date : 03-10-2023 - 10:32 IST
Published By : Hashtagu Telugu Desk
India Vs Canada : భారత్ – కెనడా మధ్య దౌత్యపరమైన యుద్ధం మరింత ముదురుతోంది. అక్టోబర్ 10లోగా 41 మంది దౌత్యవేత్తలను స్వదేశానికి పిలుచుకోవాలంటూ కెనడాకు భారత్ అల్టిమేటం ఇచ్చినట్టుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా మంగళవారం దీనిపై బ్రిటన్ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘ఫైనాన్షియల్ టైమ్స్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. అక్టోబరు 10 తర్వాత కూడా ఢిల్లీలోనే ఉండే కెనడా దౌత్యవేత్తలకు అధికారిక గుర్తింపును, ప్రొటోకాల్ ను రద్దు చేస్తామని ఇండియా వార్నింగ్ ఇచ్చిందని ఆ కథనాల్లో ప్రస్తావించారు. ఈ పరిణామాలపై కెనడా ఎలా స్పందించిందనే వివరాలను కథనంలో పేర్కొనలేదు.
We’re now on WhatsApp. Click to Join
కెనడాకు భారతదేశంలో ప్రస్తుతం 62 మంది దౌత్యవేత్తలు ఉన్నారు. వీరిలో 41 మందిని వెనక్కి పిలిపించుకోవాలని కెనడాకు భారత్ సూచించిందని అంటున్నారు. కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత నిఘా సంస్థ రా ఏజెంట్లు ఉన్నారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను ఖండిస్తున్న భారత్.. ఉగ్రవాదులకు అడ్డాగా కెనడా మారడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. కెనడా ప్రధాని ట్రూడో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్నారని ఇండియా వాదిస్తోంది. ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని తెలిపే ఆధారాలుంటే ఇవ్వాలని భారత్ సవాల్ (India Vs Canada) విసురుతోంది.