Maha Rally : 31న ఇండియా కూటమి ‘మహా ర్యాలీ’.. ఎక్కడో తెలుసా ?
Maha Rally : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమి కీలక నిర్ణయం తీసుకుంది.
- By Pasha Published Date - 02:42 PM, Sun - 24 March 24

Maha Rally : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. విపక్ష నేతలపై మోడీ సర్కారు అణచివేత వైఖరికి నిరసనగా మార్చి 31న హస్తినలోని రాంలీలా మైదాన్‌లో ‘మహా ర్యాలీ’ నిర్వహిస్తున్నట్లు ఆప్ సీనియర్ నేత గోపాల్ రాయ్ వెల్లడించారు. ఆదివారం ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈవిషయాన్ని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
భారత్‌ను కాపాడటం కోసం అన్ని రాజకీయ, ఆధ్యాత్మిక, వ్యాపార సంఘాలు ‘మహా ర్యాలీ’(Maha Rally) బహిరంగ సభలో పాల్గొనాలని గోపాల్ రాయ్ కోరారు. మోడీ సర్కారు నియంతృత్వానికి వ్యతిరేకంగా మార్చి 31న (ఆదివారం) ఉదయం 10 గంటలకు రాంలీలా మైదాన్ వేదికగా యావత్ ఢిల్లీ ఏకం కావాలన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాలని భావించే వారు.. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే వారు తప్పకుండా ఈ సభకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘సీఎం కేజ్రీవాల్ అరెస్టును అందరూ వ్యతిరేకిస్తున్నారు. దీనిపై రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే, గౌరవించే ప్రతి వ్యక్తిలోనూ కోపం ఉంది. ప్రతిపక్ష నేతలపై నకిలీ కేసులు పెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రధాని మోడీ దుర్వినియోగం చేస్తున్నారు’’ అని గోపాల్ రాయ్ ఆరోపించారు.
Also Read :IPL 2024 Final: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వేదిక ఫిక్స్.. ఎక్కడంటే..?
ప్రజాస్వామ్యాన్ని కాపాడే పిలుపు ఇది : ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు
‘‘మార్చి 31న జరిగే మహా ర్యాలీ రాజకీయ సభ కాదు. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడే పిలుపు అది. కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా గొంతు వినిపించే వేదిక అది’’ అని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ తెలిపారు. ‘‘మనదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. దాన్ని కాపాడేందుకు మా నాయకుడు రాహుల్ గాంధీ పోరాడుతున్నారు. ఈపోరాటంలో ఇండియా కూటమిలోని పార్టీలకు అండగా మేం ఉంటాం’’ అని ఆయన స్పష్టం చేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయించే నీచానికి కూడా బీజేపీ సర్కారు తెగబడిందని అర్విందర్ ఆరోపించారు.