Rahul Gandhi : లేటరల్ ఎంట్రీ నియామకాలతో రిజర్వేషన్లను హరిస్తున్నారు : రాహుల్‌గాంధీ
ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు దేశ అత్యున్నత పదవుల్లో అవకాశం దక్కకుండా చేసేందుకు లేటరల్ ఎంట్రీ నియామక పద్ధతిని ఎన్డీయే సర్కారు వినియోగిస్తోందని ఆయన ఆరోపించారు.
- Author : Pasha
Date : 19-08-2024 - 3:56 IST
Published By : Hashtagu Telugu Desk
Rahul Gandhi : లేటరల్ ఎంట్రీ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు 45 మంది కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులను నియమించేందుకు ఇటీవలే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ప్రైవేటు రంగ నిపుణులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో సేవలు అందిస్తున్న వారిని ఆయా పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఈ నియామక విధానంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు దేశ అత్యున్నత పదవుల్లో అవకాశం దక్కకుండా చేసేందుకు లేటరల్ ఎంట్రీ నియామక పద్ధతిని ఎన్డీయే సర్కారు వినియోగిస్తోందని ఆయన ఆరోపించారు.
Also Read :Mamata – Indira : మమతా బెనర్జీపై ఓ స్టూడెంట్ వివాదాస్పద పోస్టు.. బెంగాల్‌లో సంచలనం
ఒకవేళ అందుబాటులో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులనే ఆయా పోస్టులలో నియమిస్తే.. ఎంతోమంది అణగారిన వర్గాల ఆఫీసర్లకు గొప్ప అవకాశాలు లభిస్తాయని రాహుల్ గాంధీ చెప్పారు. దేశంలోని ఉన్నతోద్యోగాలను దొడ్డిదారిన ఆర్ఎస్ఎస్‌తో సంబంధం ఉన్నవారికి అప్పగించేందుకు లేటరల్ ఎంట్రీ రిక్రూట్‌మెంట్ పద్దతిని మోడీ సర్కారు తెరపైకి తెచ్చిందని ఆయన మండిపడ్డారు. రామరాజ్యం పేరుతో రాజ్యాంగ విధ్వంసానికి బీజేపీ తెగబడిందన్నారు. దళితులు, ఓబీసీలు, ఆదివాసీలకు అవకాశాలు దక్కాలనేదే కాంగ్రెస్ డిమాండ్ అని పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఇక రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తోసిపుచ్చారు. లేటరల్ ఎంట్రీ నియామక విధానంలోనూ రిజర్వేషన్లను పాటిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఎన్డీయే సర్కారు 2020లో ఓ మెమోను జారీ చేసిందన్నారు. ఆ మెమోతో ముడిపడిన వివరాలతో ఎక్స్ వేదికగా అశ్వినీ వైష్ణవ్ ఒక పోస్ట్ చేశారు. గతంలో యూపీఏ ప్రభుత్వమే లేటరల్ ఎంట్రీ విధానాన్ని పరిచయం చేసిందని ఆయన తెలిపారు. 2005 సంవత్సరంలో వీరప్ప మొయిలీ అధ్యక్షతన నియమించిన రెండో ఎస్సార్సీ సైతం లేటరల్ ఎంట్రీ విధానానికి అనుకూలంగా అభిప్రాయాన్ని తెలిపిందని గుర్తు చేశారు. అయితే ఆ విధానంలోనూ రిజర్వేషన్లను పాటిస్తూ ఎన్డీయే సర్కారు ఆదర్శవంతంగా, రాజ్యాంగబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు.