Kejriwal : నేను తిరిగి జైలుకు వెళ్లక్కర్లేదు..ఢిల్లీ ఓటల్లకు కేజ్రీవాల్ పిలుపు..
- Author : Latha Suma
Date : 13-05-2024 - 11:02 IST
Published By : Hashtagu Telugu Desk
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో అరెస్టై జైలుకు వెళ్లిన సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు(Supreme Court) మధ్యంతర బెయిల్(Interim bail) మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే జైలు నుండి బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు నాకు బెయిల్ ఇచ్చింది.. ఎన్నికలు పూర్తయ్యాక నేను తిరిగి జైలుకు వెళ్లకుండా మీ ఓటే నన్ను కాపాడుతుంది. పోలింగ్ బూత్ లలో మీరు చీపురు గుర్తును ఎంచుకుంటే నేను జైలుకు వెళ్లక్కర్లేదు’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కేజ్రీవాల్ ప్రసంగించారు. ప్రజల కోసం పనిచేస్తున్నాననే కోపంతోనే బీజేపీ తనను జైలుకు పంపించిందని ఆయన ఆరోపించారు. తప్పుడు కేసు పెట్టి జైలులో కూర్చోబెట్టినా తన ఆలోచనలు ప్రజల చుట్టూనే తిరుగుతున్నాయని వివరించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఉచిత కరెంట్, నాణ్యమైన విద్య, మొహల్లా క్లినిక్ లతో వైద్యం.. సహా ప్రజల కోసం ఎన్నో చేస్తున్నానని వివరించారు. తాను తిరిగి జైలుకు వెళితే ఈ పనులన్నీ ఆగిపోతాయని, బీజేపీ మిమ్మల్ని పట్టించుకోదని హెచ్చరించారు. సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా, మెరుగైన విద్య, వైద్యం అందాలన్నా తాను బయటే ఉండాలని చెప్పారు. ఎన్నికల ప్రచారం ముగిశాక తిరిగి జైలుకు వెళ్లాలని కోర్టు తనను ఆదేశించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. తాను జైలుకు వెళ్లకుండా అడ్డుకునే శక్తి మీకు మాత్రమే ఉందని ఢిల్లీ ఓటర్లకు చెప్పారు. చీపురు గుర్తుకు ఓటేస్తే తాను జైలుకు వెళ్లక్కర్లేదని చెప్పారు. కాగా, జూన్ 2న కేజ్రీవాల్ తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది.
Read Also: AP Poll : ఏపీ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి అమిత్ షా కీలక ట్వీట్..