Hospitals Bills : ఆస్పత్రులకు షాక్ ఇవ్వనున్న కేంద్రం? ఆర్థిక శాఖ పరిధిలోకి బీమా క్లెయిమ్స్ పోర్టల్!
Hospitals BillS : ఎవరైనా రోగి ఆస్పత్రిలో చేరితో చాలు. వారి దగ్గర అధిక డబ్బులు గుంజాలని కొన్ని ఆస్పత్రులు చూస్తుంటాయి.ఇక వారికి బీమా పాలసీ ఉందని తెలిస్తే అంతే సంగతులు.
- By Kavya Krishna Published Date - 09:12 PM, Fri - 11 July 25

Hospitals BillS : ఎవరైనా రోగి ఆస్పత్రిలో చేరితో చాలు. వారి దగ్గర అధిక డబ్బులు గుంజాలని కొన్ని ఆస్పత్రులు చూస్తుంటాయి.ఇక వారికి బీమా పాలసీ ఉందని తెలిస్తే అంతే సంగతులు. అడ్డమైన టెస్టులు చేసి వేల నుంచి లక్షల వరకు బిల్స్ వేస్తుంటారు. ఇలాంటి వారి ఆటకట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల పోర్టల్‌ను ఆర్థిక శాఖ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర యోచిస్తోంది. ఆసుపత్రులు వసూలు చేస్తున్న అధిక ఛార్జీలకు అడ్డుకట్ట వేయడం, ఆరోగ్య బీమా ప్రీమియంలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం ఈ చర్యల వెనుక ప్రధాన ఉద్దేశ్యం. ప్రస్తుతం, ఈ క్లెయిమ్‌లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నాయి. ఈ మార్పు ద్వారా ఆర్థిక మంత్రిత్వ శాఖకు మరింత నియంత్రణ అధికారం లభిస్తుంది.
ఈ కీలక నిర్ణయం ఆసుపత్రులకు పెద్ద షాక్ ఇవ్వనుంది. ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్సలకు అధిక ధరలు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. రోగులు, ముఖ్యంగా బీమా ఉన్నవారు, అనవసరమైన వైద్య పరీక్షలు, అధిక బిల్లులతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితికి ముగింపు పలకడమే ప్రభుత్వ లక్ష్యం. దీని ద్వారా బీమా క్లెయిమ్‌ల ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుంది.
ఈ మార్పుతో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI)కి మరింత అధికారం లభించనుంది. IRDAI ఆరోగ్య బీమా ధరలను నియంత్రించడంలో, ఆసుపత్రులు వసూలు చేసే ఛార్జీలను పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఆసుపత్రుల “బాదుడు”కు అడ్డుకట్ట వేయడమే కాకుండా, ఆరోగ్య బీమా ప్రీమియంలను తగ్గించి, మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడానికి దోహదపడుతుంది.
ప్రభుత్వ ఈ చర్య వెనుక సామాన్యులకు ప్రయోజనం చేకూర్చాలనే స్పష్టమైన ఉద్దేశ్యం ఉంది. అధిక ప్రీమియంల కారణంగా చాలామంది ప్రజలు ఆరోగ్య బీమా తీసుకోవడానికి వెనుకాడతున్నారు. బీమా క్లెయిమ్‌ల పోర్టల్‌ను ఆర్థిక శాఖ కిందకు తీసుకురావడం వల్ల, క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియ వేగవంతం అవ్వడమే కాకుండా, అవకతవకలకు ఆస్కారం లేకుండా పోతుంది.
ఈ నిర్ణయం అమలైన తర్వాత, ఆసుపత్రులు తమ ధరలను మరింత వాస్తవికంగా ఉంచవలసి వస్తుంది. బీమా సంస్థలు, రోగుల మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్య సంరక్షణ రంగానికి మరింత స్థిరత్వాన్ని చేకూరుస్తుంది. సామాన్యులకు నాణ్యమైన, సరసమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అవుతుంది.
Software Courses : మంచి కెరీర్ కోసం ఫుల్ డిమాండ్ ఉన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు.. మీకోసం!