Bihar : బిహార్‌లో హై అలర్ట్ : అసెంబ్లీ ఎన్నికల ముందే జైషే ఉగ్రవాదుల చొరబాటు కలకలం
నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఉగ్రవాదులను హస్నైన్ అలీ (రావల్పిండి), ఆదిల్ హుస్సేన్ (ఉమర్‌కోట్), మహ్మద్ ఉస్మాన్ (బహవల్‌పూర్)గా గుర్తించారు. వీరంతా పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహ్మద్ ముఠాకు చెందినవారుగా పోలీసులు పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 11:17 AM, Thu - 28 August 25

Bihar : బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉగ్రవాద కలకలం చెలరేగింది. పాక్ మద్దతుతో పనిచేస్తున్న జైషే మహ్మద్ ముఠాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు బిహార్‌లోకి చొరబడినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన బిహార్ పోలీసు హెడ్‌క్వార్టర్స్, ఈ ముగ్గురి ఫొటోలు, ఇతర వివరాలను విడుదల చేసింది.
ఉగ్రవాదుల వివరాలు
నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఉగ్రవాదులను హస్నైన్ అలీ (రావల్పిండి), ఆదిల్ హుస్సేన్ (ఉమర్‌కోట్), మహ్మద్ ఉస్మాన్ (బహవల్‌పూర్)గా గుర్తించారు. వీరంతా పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహ్మద్ ముఠాకు చెందినవారుగా పోలీసులు పేర్కొన్నారు. ఆగస్టు రెండో వారం నపాల్ రాజధాని కాఠ్మాండూ చేరుకున్న ఈ ఉగ్రవాదులు, ఇటీవల బిహార్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం.
సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
నేపాల్ మీదుగా చొరబడిన ఈ ఉగ్రవాదులు, సరిహద్దు జిల్లాల్లో కార్యకలాపాలు చేపట్టే అవకాశం ఉండడంతో, పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని సీమాంచల్ ప్రాంతాలు, నేపాల్ సరిహద్దు జిల్లాల్లో నిఘా పెంచారు. బహిరంగ ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, బస్ డిపోలు వంటి చోట్ల ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద నిత్య పట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
భద్రత కట్టుదిట్టం, రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో మరింత అప్రమత్తత
ప్రస్తుతం బిహార్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లను మరింత బలపరిచింది. ఆయన పర్యటనలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడటంతో పాటు, ఉగ్రవాదుల పట్ల అప్రమత్తంగా ఉన్నారు.
గత ఘటనలు, ఇప్పటికే నిఘా వర్గాల హెచ్చరికలు
ఇప్పటికే ఈ ఏడాది మే నెలలోనూ బిహార్‌లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిఘా వర్గాలు గుర్తించాయి. కేవలం 20 రోజుల్లో 18 మంది కొత్తవారు రాష్ట్రానికి రావడం గమనార్హం. వీరిలో కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ఒకరు ఖలిస్థాన్ మద్దతుదారుగా ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.
సరిహద్దు రాష్ట్రంగా బిహార్ అపాయం
బిహార్ రాష్ట్రం సుమారు 729 కిలోమీటర్ల మేర నేపాల్‌తో సరిహద్దును పంచుకుంటోంది. ఇది అక్రమ చొరబాట్లకు అనుకూలంగా మారుతోంది. ఇదే కారణంగా ఉగ్రవాద సంస్థలు ఈ మార్గాన్ని వినియోగిస్తున్నట్లు అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వేళ భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Read Also: Textile Industry : దేశీయ టెక్స్‌టైల్ పరిశ్రమకు ఊరట : పత్తి దిగుమతులపై సుంకాల మినహాయింపు