Hathras Stampede : తొక్కిసలాట ఘటన.. భోలే బాబాకు క్లీన్ చిట్
తొక్కిసలాటకు నిర్వాహకులే ప్రాథమికంగా బాధ్యులని, పోలీసుల నిర్లక్ష్యం కూడా తీవ్రంగా ఉందని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరోధించడానికి జ్యుడీషియల్ కమిషన్ కొన్ని ముఖ్యమైన సూచనలను ఇచ్చింది.
- By Latha Suma Published Date - 05:28 PM, Fri - 21 February 25

Hathras Stampede : హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో గతేడాది 121 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల జ్యుడిషియల్ కమిషన్ యూపీ ప్రభుత్వానికి పూర్తి నివేదికను సమర్పించింది. దీంతో ఈ ఘటనతో భోలే బాబాకు సంబంధం లేదని పేర్కొంటూ కమిషన్ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు పలు వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. అంతేకాక..భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావడం వల్ల తొక్కిసలాటలో ఊపిరాడని కారణంగానే వారు మరణించారని నివేదికల్లో పేర్కొన్నట్లు సమాచారం.
Read Also: Madigadda issue : కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్ల పై విచారణ వాయిదా
తొక్కిసలాటకు నిర్వాహకులే ప్రాథమికంగా బాధ్యులని, పోలీసుల నిర్లక్ష్యం కూడా తీవ్రంగా ఉందని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరోధించడానికి జ్యుడీషియల్ కమిషన్ కొన్ని ముఖ్యమైన సూచనలను ఇచ్చింది. ఏదైనా పెద్ద కార్యక్రమానికి ముందు, పోలీసు అధికారులు స్వయంగా వేదికను తనిఖీ చేయడం తప్పనిసరి అని తెలిపింది. అయిత ఈ నివేదికపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత, దీనిని ప్రస్తుత బడ్జెట్ సెషన్‌లో యూపీ శాసనసభలో సమర్పించే అవకాశం ఉంది. నివేదిక ప్రకారం సత్సంగ్ కార్యక్రమ నిర్వహకులు, పోలీసులు సరైన ఏర్పాట్లు చేయనందువల్ల, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని జ్యుడిషియల్ కమిషన్ పేర్కొంది.
కాగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హత్రాస్ తొక్కిసలాట ఘటనపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐపీఎస్ భవేష్ కుమార్ సింగ్ మరియు రిటైర్డ్ ఐఏఎస్ హేమంత్ రావులను కమిషన్ సభ్యులుగా నియమించారు. కాగా, ఈ కేసులో పోలీసులు 11 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. 2024న జూలై 2వ తేదీన ఈ తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. జనసమూహ నిర్వహణకు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రజలు నలిగిపోయి ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also: Viral Video : నిండు గర్భిణి ఏడు కిలోమీటర్లు డోలిలోనే.. వీడియో వైరల్