Raw Officer : గురుపత్వంత్ హత్యకు ‘రా’ అధికారి కుట్ర.. భారత్ స్పందన ఇదీ
Raw Officer : గురుపత్వంత్ సింగ్ పన్నూ.. ఇతడు ఖలిస్తాన్ ఉగ్రవాది. అమెరికా ఇతగాడికి ఆశ్రయం ఇస్తోంది.
- By Pasha Published Date - 11:58 AM, Tue - 30 April 24

Raw Officer : గురుపత్వంత్ సింగ్ పన్నూ.. ఇతడు ఖలిస్తాన్ ఉగ్రవాది. అమెరికా ఇతగాడికి ఆశ్రయం ఇస్తోంది. ఈ ఉగ్రవాదిని హత్య చేసేందుకు అమెరికాలో జరిగిన హత్యాయత్నం కుట్రలో భారత గూఢచార సంస్థ ‘రా’కు చెందిన అధికారి విక్రమ్ యాదవ్(Raw Officer) ప్రమేయం ఉందంటూ ‘వాషింగ్టన్ పోస్ట్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. 2022 నవంబరులో జరిగిన ఈ కుట్రకు అప్పటి ‘రా’ చీఫ్ సమంత్ గోయెల్ నుంచి కూడా అనుమతి లభించిందని కథనంలో ప్రస్తావించారు. ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్య చేసేందుకు విక్రమ్ యాదవ్ నియమించుకున్న కిరాయి హంతకుల్లో ఒకరు అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఏజెంటు కూడా ఉండటంతో విషయం బయటపడిందని కథనంలో పేర్కొన్నారు. ఆనాడు పన్నూ హత్యకు కుట్ర జరుగుతున్న విషయం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సన్నిహితులకు, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు కూడా తెలుసని, దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా అమెరికా నిఘా సంస్థలు సేకరించాయని ‘వాషింగ్టన్ పోస్ట్’ వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join
‘వాషింగ్టన్ పోస్ట్’ ప్రచురించిన ఈ కథనంపై భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మంగళవారం స్పందిస్తూ.. ‘‘ఆ కథనం నిరాధారమైనది’’ అని స్పష్టం చేశారు. ఆ అంశంపై భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరుపుతోందని వెల్లడించారు.ఊహాజనిత, బాధ్యతారహిత మైన కథనాలను అమెరికా మీడియాలో ప్రచురించడం వల్ల ఉపయోగం ఉండబోదన్నారు. వాషింగ్టన్ పోస్ట్ నివేదికపై వైట్ హౌస్ సెక్రటరీ కరీజ్ జిన్ పియర్ సమాధానమిస్తూ..ఈ అంశంపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. యూఎస్-భారత్‌లు ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాములు అని చెప్పారు.