Bhagavad Gita Curriculum : ప్రభుత్వ పాఠశాలల్లో భగవద్గీతపై పాఠ్యాంశాలు
Bhagavad Gita Curriculum : గీతా జయంతి (డిసెంబరు 22) వేడుకలను పురస్కరించుకొని గుజరాత్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
- Author : Pasha
Date : 23-12-2023 - 2:42 IST
Published By : Hashtagu Telugu Desk
Bhagavad Gita Curriculum : గీతా జయంతి (డిసెంబరు 22) వేడుకలను పురస్కరించుకొని గుజరాత్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల విద్యార్థుల కోసం భగవద్గీత ఆధారిత పాఠ్యపుస్తకాన్ని గుజరాత్ విద్యాశాఖ మంత్రి కుబేర్ దిండోర్, రాష్ట్ర విద్యాశాఖ సహాయ మంత్రి ప్రఫుల్ల పన్సేరియా ఆవిష్కరించారు. సరళమైన వచన భాషలో భగవద్గీత నుంచి శ్లోకాల అనువాదాన్ని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో అందించడమే ఈ పుస్తకం ప్రత్యేకత. ఈ పుస్తకంలోని సమాచారం ఆధారంగా భగవద్గీత శ్లోకాలపై ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల విద్యార్థులకు ప్రతి సంవత్సరం పరీక్షలు కూడా నిర్వహిస్తారు. గుజరాత్‌లోని ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు భగవద్గీతపై ఇప్పటికే ఇలాంటి రెండు పుస్తకాలను(Bhagavad Gita Curriculum) బోధిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘గీత ఏ ఒక్క మతానికి పరిమితం కాకుండా ప్రతి మతంలోని సారాంశాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల విద్యార్థులలో ఈ పవిత్ర గ్రంథం యొక్క స్ఫూర్తిని కలుగజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వ్యక్తిత్వాన్ని, కుటుంబాన్ని, దేశాన్ని నిర్మించడంలో గీతా బోధనలు ఉపయోగపడతాయి’’ అని పుస్తక ఆవిష్కరణ సందర్భంగా విద్యాశాఖ మంత్రి కుబేర్ దిండోర్ తెలిపారు. గీతలోని శ్లోకాల అనువాదాన్ని సరళమైన భాషలో ఈ పుస్తకంలో పొందుపరిచారని, ఏ విద్యార్థి అయినా పుస్తకంలోని విషయాలను సులభంగా గ్రహించగలరని వివరించారు. వాస్తవానికి పాఠశాలల విద్యా బోధనాంశాల్లో భగవద్గీతను చేర్చే ప్రతిపాదనను గుజరాత్‌లో భూపేంద్ర పటేల్ సర్కారు అధికారం చేపట్టిన తొలిసారే తీసుకొచ్చింది. విద్యార్థులకు జీవితంలో మంచి స్పష్టత కోసం గీతను బోధిస్తామని ఆనాటి విద్యాశాఖ మంత్రి జితు వాఘని ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన రెండేళ్ల తర్వాత గుజరాత్ ప్రభుత్వం నాటి ప్రతిపాదనను అమల్లోకి తెచ్చింది.