678 Houses Develop Cracks: జోషిమఠ్ లో 678 ఇళ్లకు పగుళ్లు.. సహాయక చర్యలు ముమ్మరం
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ను కొండచరియలు విరిగిపడే ప్రాంతంగా ప్రకటించడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అదే సమయంలో జోషిమఠ్‌కు చెందిన 678 ఇళ్లకు పగుళ్లు (678 Houses Develop Cracks) వచ్చాయి. ఆదివారం వరకు 68 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
- Author : Gopichand
Date : 10-01-2023 - 7:55 IST
Published By : Hashtagu Telugu Desk
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ను కొండచరియలు విరిగిపడే ప్రాంతంగా ప్రకటించడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అదే సమయంలో జోషిమఠ్‌కు చెందిన 678 ఇళ్లకు పగుళ్లు (678 Houses Develop Cracks) వచ్చాయి. ఆదివారం వరకు 68 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదే సమయంలో జోషిమఠ్ లోని గాంధీనగర్, సింఘ్‌ధార్, మనోహర్ బాగ్, సునీల్ వార్డులను పరిపాలన అసురక్షిత ప్రాంతాలుగా ప్రకటించింది. అంతకుముందు.. సుమారు 600 బాధిత కుటుంబాలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించిన ఒక రోజు తర్వాత ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ సింగ్ ధామి శనివారం జోషిమఠ్‌ను సందర్శించి భూమి పరిస్థితిని అంచనా వేశారు. ఆ సమయంలో సీఎం ధామి మాట్లాడుతూ.. జోషిమఠ్ సంస్కృతి, మతం, పర్యాటకానికి ముఖ్యమైన ప్రదేశమని అన్నారు. దాన్ని కాపాడేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు.
సహాయక చర్యల గురించి సమాచారం ఇస్తూ చమోలి జిల్లా మేజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా మాట్లాడుతూ.. నగరంలో వివిధ ప్రదేశాలలో 229 గదులు గుర్తించబడ్డాయి. ఇందులో 1,271 మందికి వసతి కల్పిస్తామని, వీటిలో 46 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు రూ.2.30 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున రేషన్ కిట్‌లను పంపిణీ చేసినట్లు తెలిపారు.
Also Read: Earthquake: ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రత నమోదు
జిల్లా మేజిస్ట్రేట్ ఇంటింటికీ వెళ్లి దెబ్బతిన్న ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేసి తాత్కాలిక సహాయ కేంద్రాలకు తరలించాలని కోరారు. మరోవైపు ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ సంధు ఆదివారం జోషిమఠ్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి క్షేత్ర పరిస్థితిని సమీక్షించారు. చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ.. ఇటువంటి పరిస్థితిలో మీరు ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు. నిర్వాసితుల భద్రతే తక్షణ ప్రాధాన్యమని, జిల్లా యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని.. భూమి పడిపోవడానికి గల కారణాలను భౌగోళిక నిపుణులు నిర్ధారిస్తున్నారని తెలిపారు. జోషిమఠ్‌లో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మరోవైపు, జోషిమఠ్‌ను భారీ కొండచరియలు విరిగిపడే ప్రమాద ప్రాంతంగా ప్రకటించామని, 60కి పైగా బాధిత కుటుంబాలను తాత్కాలిక సహాయ కేంద్రాలకు తరలించామని హిమాన్షు ఖురానా తెలిపారు. మరోవైపు కనీసం 82 కుటుంబాలను వీలైనంత త్వరగా తాత్కాలిక సహాయ కేంద్రాలకు తరలించాల్సి ఉంటుందని గర్వాల్ కమిషనర్ సుశీల్ కుమార్ తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఎంఎ) సభ్యులు జోషిమత్ నగరాన్ని సందర్శించి, అక్కడ పెరుగుతున్న ఆందోళనల మధ్య పరిస్థితిని సమీక్షించనున్నారు.