Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ఏమిటి..? ప్రయోజనాలు ఏంటి..?
పేద, అల్పాదాయ వర్గాలకు చెందిన ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని (Ayushman Bharat) ప్రారంభించింది.
- By Gopichand Published Date - 10:19 AM, Fri - 11 August 23

Ayushman Bharat: ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY) ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య పథకాలలో ఒకటి. దీన్ని 2018 సెప్టెంబర్ 23న ప్రధాని నరేంద్ర మోదీ (పీఎం మోదీ) ప్రారంభించారు. ఎకనామిక్ టైమ్స్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఆగస్టు 1, 2023 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 24.33 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. పిఐబి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఇచ్చిన సమాచారం ప్రకారం.. పథకంలో మోసాలను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML)లను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏఐ ద్వారా నకిలీ కార్డును గుర్తిస్తారు
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే CAG.. పథకంలోని నకిలీని బహిర్గతం చేస్తూ ఈ పథకంలో సుమారు 7.5 లక్షల మంది లబ్ధిదారులు ఒకే మొబైల్ నంబర్ మీద నమోదు చేసుకున్నారని సమాచారం. ఇటువంటి పరిస్థితిలో పథకం ప్రయోజనాలను సరైన వ్యక్తులకు అందించడానికి AI సాంకేతికతను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా మోసాలను అరికట్టవచ్చు. ఇప్పుడు కృత్రిమ మేధస్సు ద్వారా నకిలీ కార్డులను గుర్తించనున్నారు.
ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ఏమిటి?
పేద, అల్పాదాయ వర్గాలకు చెందిన ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని (Ayushman Bharat) ప్రారంభించింది. ఈ పథకం కింద లబ్ధిదారులు రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా ప్రయోజనం పొందుతారు. ఈ పథకంలో నమోదు చేసుకున్న కార్డుదారుడు ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు. ఈ పథకం కింద, గిరిజన (SC / ST), నిరాశ్రయులైన, నిరుపేదలు, దాతృత్వం లేదా భిక్షను కోరుకునే వ్యక్తి, కార్మికుడు మొదలైనవారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం.. పథకం మొత్తం లబ్ధిదారుల్లో 49 శాతం మంది మహిళలు ఉన్నారు.
ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన ఉపయోగాలు..!
– ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన అంటే ఆయుష్మాన్ భారత్ యోజన కింద దేశంలోని ప్రతి పేదవాడు ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో రూ. 5 లక్షల వరకు చికిత్స పొందవచ్చు.
– ఇందులో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి 15 రోజుల వరకు ఆసుపత్రి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది.
-కుటుంబ సభ్యులందరూ ఆరోగ్య పథకం ప్రయోజనాలను పొందవచ్చు.
– ఇందులో ఎలాంటి వయోపరిమితిని నిర్ణయించలేదు.
– నగదు రహిత చికిత్స ద్వారా లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు.
– మీరు కూడా పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, దాని అధికారిక వెబ్‌సైట్ pmjay.gov.inని సందర్శించండి.