Gali Janardhan Reddy: కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య జైలుకు వెళ్లడం ఖాయం
- By Kode Mohan Sai Published Date - 02:05 PM, Sat - 5 October 24

బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్దరామయ్య గతంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, అయితే తాను ప్రస్తుతానికి శాసనసభలో ప్రజా ప్రతినిధిగా స్థానం సంపాదించుకున్నానని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. భూ కుంభకోణంలో చిక్కుకున్న సిద్దరామయ్య జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన చెప్పారు. శుక్రవారం సండూరులో పర్యటించిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా, తాను ఎలాంటి తప్పు చేయలేదని, బళ్లారి జిల్లా అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నానని తెలిపారు. సండూరు శాసనసభ స్థానం మీద బీజేపీ అభ్యర్థి గెలవకపోయినా, సండూరుకు సంబంధించిన కూడ్లికి, హొసపేట తోరణగల్లుకు రూ.200 కోట్లతో రోడ్డు నిర్మాణం చేయడాన్ని ఆయన ప్రస్తావించారు.
జింథాల్ వంటి ఐదు కంపెనీలు జిల్లాలో వస్తే, స్థానికులకు ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నానని చెప్పారు. అయితే, తన ఆశయాలు మరియు ఆకాంక్షలు నీరుగార్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రస్తుతం అధికారం లేకుండా ఇంట్లో కూర్చోబెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. ఒకరి జీవితం పాడుచేస్తే, ఆ దేవుడు తనకు శిక్ష వేస్తాడని కర్ణాటకలో జరుగుతున్న ఘటనలు సాక్ష్యంగా ఉన్నాయన్నారు. ముడా కేసులో సీఎం సిద్దరామయ్య వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని, ఆ డబ్బు మొత్తం తిరిగి చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సండూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వస్తానని, ప్రజలను బీజేపీని ఆదరించమని కోరతానన్నారు.
తనపై అభిమానం చూపించిన ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటానని ఆయన అన్నారు. అంతకు ముందు, పట్టణంలోని విరక్తమఠానికి చేరుకుని ప్రభుస్వాముల ఆశీర్వాదం పొందారు. అనంతరం, కుమారస్వామి దేవస్థానానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా, బీజేపీ ప్రముఖులు కేఎస్ దివాకర్, బీజేపీ ఎస్టీమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బంగారి హనుమంతు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు జీటీ పంపాపతి, మరియు ఇతర ప్రముఖులు విఠలాపుర, తిరుమల, జేసిబి రామకృష్ణ, హుడేద సురేశ్, కరడి ఎర్రిస్వామి, గుడేకోట నాగరాజు, అంబరీష్, చోరనూరు అడివప్ప పాల్గొన్నారు.