No To Diesel Vehicles : 36 కోట్ల వాహనాలను వదిలించుకుంటాం.. కేంద్ర మంత్రి ప్రతిజ్ఞ
No To Diesel Vehicles : దేశంలోని 36 కోట్ల పెట్రోల్, డీజిల్ వాహనాలను పూర్తిగా వదిలించుకుంటామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిజ్ఞ చేశారు.
- By Pasha Published Date - 02:45 PM, Mon - 1 April 24

No To Diesel Vehicles : దేశంలోని 36 కోట్ల పెట్రోల్, డీజిల్ వాహనాలను పూర్తిగా వదిలించుకుంటామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిజ్ఞ చేశారు. భారతదేశాన్ని హరిత ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ఆశయ సాధన కోసం హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని ప్రభుత్వం తగ్గించాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని 5 శాతం, ఫ్లెక్స్ ఇంజన్లపై 12 శాతం మేర తగ్గించాలనే ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు పంపామని.. ప్రస్తుతం అవి పరిశీలన దశలో ఉన్నాయని వెల్లడించారు.ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గడ్కరీ ఈవిషయాన్ని వెల్లడించారు. ‘‘పెట్రోల్, డీజిల్ వాహనాలను పూర్తిగా వదిలించుకోవడం భారతదేశానికి సాధ్యమయ్యే పనేనా ?’’ అని విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఔను.. నూటికి నూరు శాతం సాధ్యమవుతుంది. అది కష్టమైన విషయమే కానీ అసాధ్యమైన విషయం కానే కాదు’’ అని ఆయన(No To Diesel Vehicles) బదులిచ్చారు.
We’re now on WhatsApp. Click to Join
దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాన్ని జీరో స్థాయికి తగ్గించే లక్ష్యం ఎప్పటిలోగా నెరవేరుతుందని ఇప్పుడే చెప్పడం కష్టమని ఆయన అన్నారు. జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా మన దేశం విదేశాల నుంచి ఇంధన వనరుల దిగుమతిని నిలువరించగలదని తాను బలంగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. వాతావరణ సంక్షోభం తలెత్తకుండా చూసేందుకు విద్యుత్ ఉత్పత్తిలో శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అందుబాటులోకి వస్తాయని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఇంధన దిగుమతులపై మనదేశం ఏటా రూ.16 లక్షల కోట్లు వెచ్చిస్తోంది. ఈ డబ్బు ఆదా అయితే రైతుల జీవితాల మెరుగుదలకు వాడొచ్చు. గ్రామాలు సుభిక్షంగా ఉండేలా ప్రణాళికలు రెడీ చేయొచ్చు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించొచ్చు’’ అని కేంద్ర మంత్రి గడ్కరీ వివరించారు.
Also Read :RBI: ఆర్బీఐకి 90 ఏళ్లు.. ప్రత్యేక రూ. 90 నాణెం విడుదల చేసిన ప్రధాని మోడీ
‘‘నేను హైడ్రోజన్‌తో నడిచే కారులో తిరుగుతున్నాను. ఫ్యూచర్‌లో ప్రతి ఇంట్లో ఎలక్ట్రిక్ కార్లు కనిపిస్తాయి. ఇది అసాధ్యమని చెప్పుకునేవాళ్లు తమ అభిప్రాయాలను మార్చుకునే రోజులు వస్తాయి’’ అని గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘టాటాలు, అశోక్ లేలాండ్ హైడ్రోజన్‌తో నడిచే ట్రక్కులను ప్రవేశపెట్టాయి. ఎల్‌ఎన్‌జీ/సీఎన్‌జీతో నడిచే ట్రక్కులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 350 బయో-సీఎన్‌జీ ఫ్యాక్టరీలు ఉన్నాయి’’ అని గడ్కరీ వివరించారు. ‘‘బజాజ్, టీవీఎస్, హీరో వంటి ఆటో కంపెనీలు ఫ్లెక్స్ ఇంజన్లను ఉపయోగించి మోటార్‌సైకిళ్లను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఆ సాంకేతికతను ఉపయోగించి ఆటో రిక్షాలను కూడా తయారు చేసేందుకు సమాయత్తం అవుతున్నాయి’’ అని గడ్కరీ చెప్పారు.