Tamil Nadu : ఇక పై సైన్‌బోర్డులపై పేర్లు తమిళంలో ఉండాల్సిందే : పుదుచ్చేరి సీఎం
మరీ ముఖ్యంగా ఈ విషయంలో తమిళనాడు అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఈనేపథ్యంలో త్రిభాషా సూత్రంపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈక్రమంలోనే పుదుచ్చేరి నుంచి స్పందన వచ్చింది.
- By Latha Suma Published Date - 02:19 PM, Tue - 18 March 25

Tamil Nadu : కొంతకాలంగా తమిళనాడు అధికారిక డీఎంకే పార్టీ, కేంద్రం మధ్య కొంతకాలంగా హిందీ భాష విషయంలో వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈక్రమంలో తమిళం మాట్లాడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్న కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఇకపై దుకాణాలు, వ్యాపార సముదాయాల సైన్‌బోర్డులపై పేర్లు తమిళంలో ఉండాల్సిందేనని సీఎం రంగస్వామి అన్నారు. ఈ మేరకు సూచనలు చేస్తూ సర్క్యులర్ జారీ చేస్తామని ఆయన చెప్పారు.
Read Also: Manchu Brothers : వెండితెర పై ఫైట్ కు సిద్దమైన మంచు బ్రదర్స్
అయితే హిందీని అందరిపై రుద్దడానికే కేంద్రం దీనిని తెరపైకి తెచ్చిందని కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ విషయంలో తమిళనాడు అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఈనేపథ్యంలో త్రిభాషా సూత్రంపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈక్రమంలోనే పుదుచ్చేరి నుంచి స్పందన వచ్చింది. పుదుచ్చేరి లో తమిళం, తెలుగు, మలయాళం, ఇంగ్లిష్, ఫ్రెంచ్ అధికారిక భాషలు. అయితే ఇక్కడ తమిళభాష మాట్లాడేవారి సంఖ్యే ఎక్కువ.
ఇదిలాఉంటే.. జాతీయ విద్యా విధానంలోని (ఎన్‌ఈపీ-2020) త్రిభాషా సూత్రంపై రాజకీయ దుమారం రేగుతోంది. కొత్త విధానంలో భాగంగా మూడు భాషలను విద్యార్థులు నేర్చుకోవాల్సిందేనని, అందులో రెండు భారతీయ భాషలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం అంటుంది. ఇకపోతే.. రాష్ట్ర బడ్జెట్ లోగోలో ఇప్పటివరకు ఉన్న ₹ అనే లోగో స్థానంలో తమిళంలోని ‘రూ’ అనే తమిళ అక్షరాన్ని మార్చిన విషయం తెలిసిందే. భాష విషయంలో ఎంత దృఢంగా ఉన్నామో చెప్పడానికే ఈ మార్పు చేసినట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.